మనం బాల్యంలో వేమన శతకం చదువుకున్నాం కదా. తన కోపమే తన శతృవు… తన శాంతమే తనకు రక్ష… ఈ పద్యం మనందరికీ బాగా తెలుసు. ఈ పద్యాన్ని మనమంతా కంఠతా పట్టాం. పద్యంలోని నీతిని మనం ఫాలో అవుతున్నామా అంటే లేదని చెప్పాలి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటాం. అనవసరమైన విషయాలను లోపలికి తీసుకొని బాధపడతాం. మనం బాధపడటమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవాళ్లను కూడా బాధపెడుతుంటాం. దీనికి సంబంధించిన ఓ కథ మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకొనోక రోజు సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురూ కలిసి వన విహారానికి బయలుదేరారు. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండటంతో కాలం తెలియలేదు. చీకటిపడింది. ఆ కాలంలో రాత్త్రైతే నూనె దీపాలు తప్పించి మరో సాధనాలు ఉండేవి కాదు. ఇక అడవిలోకి ప్రవేశిస్తే సూర్యాస్తమయం నుంచి మళ్లీ సూర్యోదయం వరకు చీకటిలో మగ్గిపోవలసిందే. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురు కూడా చీకట్లో ఉండిపోవలసి వచ్చింది. కీకారణ్యం కావడంతో ముగ్గురూ అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడటంతో శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకీ ముగ్గురిలో ఒకరి చొప్పున మేలుకొని ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా బలరాముడు, శ్రీకృష్ణుడు ముందుగా నిద్రపోగా… సాత్యకి కాపలాగా ఉంటాడు. ఆ సమయంలో ఓ రాక్షసుడు అక్కడికి వస్తాడు. వెంటనే సాత్యకి ఆయుధాలు ధరించి రాక్షసుడికి మీదకు లంఘిస్తాడు. సాత్యకి పెద్దగా అరిచేకొలది రాక్షసుడు తన ఆకారాన్ని పెంచుతాడు. ఆ విధంగా రాక్షసుడు తన ఆకారాన్ని ఇంతితై వటుడింతై అన్నట్టుగా పెరిగిపోతుంది. చివరకు ఆ రాక్షసుడు సాత్యకిని చిత్తుచిత్తుగా ఓడిస్తాడు. కాసేపటి తరువాత బలరాముడు నిద్రలేవడంతో నొప్పులతో సాత్యకి పడుకుండిపోతాడు. బలరాముడి విషయంలోనూ అదేవిధంగా జరుగుతుంది. బలరాముడు సహజంగానే ముక్కోపి. దీంతో ఆయన కోపంతో రగిలిపోయే కొలది రాక్షసుడు మరింతగా పెరిగిపోతాడు. ఈ విధంగా ఆయన ఆకారం భారీగా పెరుగుతుంది. చివరకు బలరాముడు కూడా ఆ రాక్షసుడి చేతిలో ఓడిపోతాడు. కాగా, ఆ తరువాత కన్నయ్య నిద్రలేవడంతో బలరాముడు కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు.
కన్నయ్య ముందుకు కూడా ఆ రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు భీకరంగా అరవగా, కన్నయ్య ప్రశాంతంగా ఆయనపై యుద్ధానికి సై అంటాడు. యుద్ధానికి సై అనడంతో శ్రీకృష్ణుడు కూడా ప్రశాంత వదనంతో రాక్షసుడిని అడ్డుకుంటాడు. కన్నయ్య ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రాక్షసుడు అంత చిన్నవాడు అవుతాడు. చివరకు రాక్షసుడు అంగుళం అంతటివాడుగా మారిపోవడంతో ఆ రాక్షసుడిని ఉత్తరీయంలో బంధించి పక్కన ఉంచుతాడు. తెల్లవారిన తరువాత బలరాముడు, సాత్యకి ఇద్దరూ రాక్షసుడి గురించి చెప్పగా, కన్నయ్య ఉత్తరీయం మూటవిప్పి చూపుతాడు. ఉత్తరీయం మూటలో ఆ రాక్షసుడు కనిపించడంతో ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇందులో ఉన్న నీతి ఏమంటే…క్రోధం వలన సాధించేదేమి ఉండదు… కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.