అనగనగా ఓ అడవి. ఆ అడవిలో అనేక జంతువులు ఉన్నాయి. అయితే, అడవిలోని అన్ని జంతువులు ఒకలా ఉంటే… గొర్రెపోతు మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ, ప్రతి ఒక్కరిని దాని వాడి కొమ్ములతో పొడుస్తూ బాధపెడుతూ ఉంటుంది. దాని బాధ భరించలేక చాలా జంతువులు ఆ అడవిని వదిలి వెళ్లిపోయాయి కూడా. కానీ, ఎన్ని జంతువులు అడవిని వదిలి వెళ్లిపోతున్నా… గొర్రెపోతు పట్టించుకోలేదు. గొర్రెపోతు వాడి కొమ్ములతో పొడవడం ప్రారంభించింది. ఒకరోజు జంతువున్నీ కలిసి జిత్తులమారి నక్క వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాయి. గొర్రెపోతుకు ఎంత బుద్ధి చెప్పినా తన బుద్ధి మార్చుకోవడం లేదని, ఎలాగైనా గొర్రెపోతుకు బుద్ధి చెప్పాలని వేడుకున్నాయి.
అడవిలోని జంతువులు అన్నీ కలిసి నక్కకు మొరపెట్టుకోవడంతో నక్కకు కాస్త గర్వం పెరిగింది. సమస్యను తాను మాత్రమే పరిష్కరించగలనని నమ్మకం ఏర్పడింది. జంతువుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించిన నక్క గొర్రెపోతు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ప్లాన్ చేసింది. ఓరోజు గొర్రెపోతు వద్దకు వెళ్లగానే నక్కను తన వాడియైన కొమ్ములతో పొడిచింది. నక్కకు ఆ దెబ్బ బలంగా తాకినా… బాధను దిగమింగుకొని, ఓ ప్లాన్ వేసింది. బలాన్ని బలహీనులపై చూపించడం మంచిది కాదని, బలహీనుల కంటే తనకన్నా బలమైన వాళ్లపై ప్రతాపం చూపి, వారిని ఓడిస్తే ఈ అడవిలో నీకన్నా బలవంతులు ఎవరూ ఉండదని నక్క రెచ్చగొడుతుంది. నక్క తన మాటలతో రెచ్చగొట్టడంతో గొర్రెపోతు గర్వం తలను దాటి కొమ్ములను చేరుతుంది.
గొర్రెపోతు కళ్లల్లో పొగరు, గర్వం కనిపించే సరికి నక్క తన తలను దూరంగా ఉన్న కొండవైపు చూపుతూ అదిగో ఆ కొండ నీకన్న బలవంతురాలని గర్వపడుతున్నది. ఆ కొండను నీ కొమ్ములతో బద్దలు కొడితే దానికన్నా నీవే బలవంతురాలివి అవుతావు. నిన్ను అందరూ గౌరవిస్తారు అని చెబుతుంది. నక్క మాటలను నమ్మిన గొర్రెపోతు దూరంగా ఉన్న ఇసుక కొండ వద్దకు వెళ్లి బలంగా కుమ్ముతుంది. దీంతో కొంత ఇసుక రాలిపడుతుంది. ఇసుక రాలిపడటంతో గొర్రెపోతు మరింత బలంగా కుమ్మేందుకు నాలుగు అడుగులు వెనక్కి వేసి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కుమ్ముతుంది. అంతే, దాని రెండు కొమ్ములు విరిగిపోతాయి. దేనిని చూసుకొని గొర్రెపోతు విర్రవీగిందో ఆ కొమ్ములు విరిగిపోవడంతో ఒక్కసారిగా ఢీలాపడుతుంది. తన గర్వం ఒక్కసారిగా వీగిపోతుంది. ఆ రోజు నుంచి అడవిలోని అందరితో సఖ్యతగా ఉండటం మొదలుపెడుతుంది.
నీతిః బలం ఉందని విర్రవీగితే…ఏదోఒక రోజు ఆ గర్వం వీగిపోతుంది. అందరిముందు తలవంచుకోవలసి వస్తుంది.