గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా కాలో దుంగార్ పర్వత శిఖరంపై వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తి, కరుణ, ప్రకృతి సహజీవనానికి అద్భుత ప్రతీకగా నిలుస్తోంది. సుమారు 400 ఏళ్లుగా ఈ ఆలయంలో కొనసాగుతున్న ఓ అపూర్వ సంప్రదాయం భక్తులకే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. అదే నక్కలకు ప్రసాదం సమర్పించే విశేష ఆచారం.
పురాణ కథనాల ప్రకారం, ఒకప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో నక్కలు తీవ్ర ఆకలితో అలమటించేవి. వాటి దుస్థితిని గమనించిన దత్తాత్రేయ స్వామి, తన శరీరాన్నే వాటికి ఆహారంగా అర్పించడానికి సిద్ధపడ్డారని భక్తుల విశ్వాసం. ఆ మహాకరుణకు చిహ్నంగా ఈ ఆలయంలో నేటికీ నక్కలకు ప్రత్యేకంగా ప్రసాదం అర్పిస్తారు.
ఏకాదశి ఉపవాసానికి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది
ప్రతిరోజూ సాయంత్రం ఆలయ పూజారి ఆలయ అరుగు మీద ప్రసాదాన్ని ఉంచి సంప్రదాయబద్ధంగా పిలుస్తారు. కొద్దిసేపటిలోనే అరణ్యంలో నుంచి నక్కలు వచ్చి ఎంతో శాంతంగా ప్రసాదాన్ని స్వీకరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎన్నో సంవత్సరాలుగా అవి ఎప్పుడూ భక్తులపై దాడి చేయలేదు. ఇది దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు, కరుణ ప్రభావమేనని స్థానికులు నమ్ముతారు.
ప్రకృతి, జంతువులు, మనుషుల మధ్య సౌహార్దాన్ని చాటే ఈ అరుదైన సంప్రదాయం చూడటానికి నేటికీ దేశవిదేశాల నుంచి అనేక మంది భక్తులు, పర్యాటకులు కాలో దుంగార్‌కు తరలివస్తున్నారు.