త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వజ్రం రహస్యం

Explore Trimbakeshwar

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇక్కడే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. నాసిక్‌ నుంచి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండటం విశేషం. వేద అద్యయనం చేసేందుకు ఇక్కడికి ఎక్కువగా బ్రాహ్మణులు వస్తుంటారు. అందుకే త్రయంబకేశ్వరాన్ని బ్రాహ్మణ కుటుంబాలు కలిగిన ఊరుగా చెబుతారు. ఈనాటికి ఇక్కడ అనేక వేద గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడే అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు, మఠాలు అనేకం ఉన్నాయి. పురాణాల ప్రకారం నాసిక్‌, త్రయంబకేశ్వరం సత్యయుగానికి చెందినవిగా పేర్కొన్నారు. హనుంతుని జన్మస్థలం అంజనేరి కూడా ఈ ప్రాంతంలోనే ఉందని పండితులు చెబుతున్నారు. ఇక త్రయంబకేశ్వరంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం అభిషేకం తరువాత స్వామివారికి బంగారు కిరీటం, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన వెండి తొడుగులను అలంకరిస్తారు. బంగారు కిరీటాన్ని పాండవులు స్వామివారికి సమర్పించారని చెబుతారు. ఇక ఒకప్పుడు ఈ కిరీటంలో నాసిక్‌ వజ్రం ఒకటి ఉండేది. ఈ వజ్రం సుమారు 90 క్యారెట్ల బరువుతో నీరం రంగులో ఉండేది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో దొరికిన ఈ వజ్రాన్ని అప్పటి రాజులు స్వామిపై ఉన్న భక్తితో ఆయనకు కానుకగా సమర్పించారు. చాలా కాలంపాటు ప్రతి సోమవారం స్వామివారి అలంకరణలో భాగంగా దీనిని ధరింపజేసేవారు. అయితే, మూడో ఆంగ్లో మరాఠ యుద్ధానంతరం, ఆంగ్లేయులతో జరిగిన ఒడంబడికలో భాగంగా ఈ నాసిక్‌ వజ్రం ఆంగ్లేయుల చేతికి దొరికింది. బ్రిటీషర్లు ఈ వజ్రాన్ని భారత్‌ నుంచి ఇంగ్లాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వజ్రం ఇంగ్లాండ్‌లోనే ఉంది. అయితే, భారత ప్రభుత్వం ఈ నాసిక్‌ వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తరలించిన సంపదను తిరిగి ఇండియాకు తీసుకురావడమే లక్ష్యంగా భారత్‌ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చరిత్రను పక్కనపెడితే త్రయంబకేశ్వరంలో మహాశివుడు అగ్నిరూపంలో కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అగ్నిరూపంలో కొలువై ఉండటం వెనుక ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఈ కథ మనకు తెలిసిందే అయినా మరోసారి గుర్తు చేసుకుందాం. సత్యయుగంలో బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేనే గొప్ప అని వాదులాడుతుండగా మహాశివుడు జ్వాలాస్తంభంగా మారి తన ఆద్యంతాలు కనుగొనాలని ఆదేశించాడు. శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్లగా బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు. పైనుంచి వస్తున్న కేతకి పుష్పాన్ని సాక్షిగా తీసుకొని వచ్చిన బ్రహ్మను చూసి ఆగ్రహించిన మహాశివుడు భూలోకంలో సాకారరూపంలో పూజలు అందుకునేందుకు అర్హత లేకుండా శపిస్తాడు. అలా అవతరించిన జ్వాలాస్తంబమే ఆ తరువాత జ్యోతిర్లింగమై త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా భక్తులచేత పూజలందుకుంటున్నది.

శ్రీమహావిష్ణువు కోరిక మేరకు భూలోకంలో 64 ప్రదేశాలలో జ్యోతిర్లింగాలు ఏర్పాటు కాగా, ఆ జ్యోతిర్లింగాలలో మహాశివుడు కొలువై ఉన్నట్టుగా శివపురాణం చెబుతున్నది. వాటిలో 12 జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఈ 12 జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లతో పేరు వచ్చేలా చేశారు. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం సహ్యాద్రి పర్వత శ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాల దగ్గర ఉంటుంది. చుట్టూ పెద్ద ప్రహరీగోడతో పెద్ద పెద్ద తలుపులున్న ముఖద్వారంతో భూలోక కైలాసంగా ఉంటుంది. లోపల విశాలమైన ప్రాకారాలు, అందులో అబ్బురపరిచే శివలింగాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక సోమరసం నుంచి వచ్చే అభిషేక తీర్థం ప్రదేశం, స్థలవృక్షం మనసును ఆహ్లాదపరుస్తాయి. బిల్వచెట్టు కోవెల పుష్కరిణిలను చూస్తూ అక్కడే ఉన్న ఓ చిన్న తలుపు తెరుచుకొని బయటవస్తే… మనల్ని మనమే నమ్మలేనంత అద్భుతం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడే గోదావరి నది పుట్టింది. ఇక్కడ పుట్టిన గౌతమి పరవళ్లు తొక్కుతూ ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఆలయంలోని లక్ష్మీనారాయణ మందిరం, గోపాలకృష్ణ మందిరం, గాయత్రిదేవి స్వయంభూ విగ్రహాలను దర్శించుకుంటే చాలు జన్మధన్యమౌతుంది.

త్రయబంకేశ్వరం నుంచి పరవళ్లు తొక్కే గోదావరి అసలైన పుట్టుక ప్రదేశాన్ని చూడాలి అంటే బ్రహ్మగిరి కొండపైకి చేరుకోవాలి. అక్కడి గోముఖం నుంచి బొట్టుబొట్టుగా గోదావరి బయటకు వస్తుంది. శిలల నుంచి సన్నగా వచ్చే గోదావరి దిగువకు చేరిన తరువాత ఉదృతమైన నదీ రూపంలో పరవళ్లు తొక్కుతుంది. త్రయంబకేశ్వర ఆలయంలో కాలసర్పశాంతి, మృత్యుంజయ హోమం, త్రిపిండి విధి, నారాయణ నాగబలి పూజలు విశేషంగా జరుగుతాయి. నారాయణ నాగబలి పూజలు ఆరోగ్యం కోసం చేపడతారు. ఈ పూజలు ఈ ఆలయంలో తప్పించి మరెక్కడా జరగవు. ఇది క్లుప్తంగా త్రయంబకేశ్వర ఆలయం విశేషాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *