ఒక్క చుక్క నీళ్లు పోస్తే చాలు సంబరపడిపోతాడు ఆ శివయ్య. భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తే మనం ఏం కోరుకుంటే దానిని వెంటనే ఇచ్చేస్తాడు. భక్తులు ఏమిచ్చినా కాదనకుండా తీసుకునేవాడే శివుడు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేవాడే ఆ భోళాశంకరుడు. పాము, ఏనుగు, సాలీడు పురుగులు చేసిన సేవ, పెట్టిన నైవేద్యం స్వీకరించి వాటికి శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు శ్రీకాళహస్తీశ్వరుడు. అంతెందుకు, కన్నప్ప ఇచ్చిన మాంసాన్ని కూడా ఆయన ప్రసాదంగా స్వీకరించాడు. మనం ఏమి ఇస్తున్నామన్నది ఆయనకు ముఖ్యంకాదు. ఎంత భక్తితో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే ఆయన వైరాగ్యుడు, స్మశానవాసుడు. ఏమిచ్చినా తీసుకుంటాడు. ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు. అటువంటివాడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించలేడా చెప్పండి. ఈరోజు మనం చెవినొప్పిని తగ్గించే శివాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
మకరసంక్రాంతికి పీతలు నైవేద్యం
సాధారణంగానే పిల్లలు, పెద్దలకు అందరికీ చెవినొప్పి వస్తుంటుంది. చెవినొప్పి బాధ వర్ణణాతీతం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో మందులు వాడుతుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎటువంటి గుణం కనిపించదు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న శివాలయంలో పీతలను సమర్పించడం వలన చెవినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మనం ఈ శివాలయాన్ని దర్శించుకోవాలంటే గుజరాత్ వరకు వెళ్లాలి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రుంధనాథ మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్నే రామనాథ శివఘోలా ఆలయం అనికూడా పిలుస్తారు. రాములవారు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తులు చెబుతున్నారు. ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, మకర సంక్రాంతి రోజున ప్రత్యేకించి స్వామివారికి పీతలను సమర్పిస్తారు. ఇలా స్వామివారికి పీతలను సమర్పించడం వలన చెవినొప్పి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
రాముడి పాదాలను తాకిన పీత
స్వామికి పీతలను సమర్పించడం వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు వనవాసానికి వచ్చిన సమయంలో ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో ఓ సముద్రం ఉండేదట. రాములవారు ఆ ప్రాంతంలో సంచరించే సమయంలో సముద్రంలోని ఓ పీత పదేపదే రాములవారి పాదాల వద్దకు వచ్చి ఆయనకు నమస్కరిస్తూ ఉంటుండేది. రాములవారి పాదాలను తాకి ఆ పీత ఎంతో సంతోషించేది. ప్రతిరోజూ రాముడు వద్దకు వస్తున్న ఆ పీతకు స్వామివారు ఓ వరం ప్రసాదించారు. రాముడు నిర్మించిన రంధనాథ మహాదేవ ఆలయంలో పీతలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని, ముఖ్యంగా చెవికి సంబంధించిన రుగ్మతలు తగ్గిపోతాయని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి మహాదేవునికి పీతలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది.
శతాబ్ధాలుగా కొనసాగుతున్న ఆచారం
ఇక్కడ పీతలకు ప్రజలెవరూ ఎటువంటి హాని చేయరు. ఆలయంలో స్వామివారికి సమర్పించే పీతలను అధికారులు సేకరించి తిరిగి వాటిని సముద్రంలో వదిలేస్తారు. కోరిక కోరిక నెరవేరినపుడు స్వామికి పీతలు సమర్పిస్తారు. ఇలా సమర్పించినవారి చెవికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే నయమౌతాయని భక్తులు నమ్ముతారు. ఎన్నో శతాబ్దాలుగా మకర సంక్రాంతి రోజున పీతలను సమర్పించే ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ సంప్రదాయం కారణంగానే రుంధనాథ మహాదేవ ఆలయం ప్రత్యేకించి ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో పీతలను సమర్పించిన తరువాత పక్కనే ఉన్న స్మశానానికి వెళ్లి తమ పూర్వికుల ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆత్మలు పుణ్యలోకాలకు వెళ్లాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారట. ఇలా స్మశానంలో ప్రార్థించి పూర్వికులకు ఇష్టమైన వస్తువులను అక్కడే ఉంచుతారు.