దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అందులో కొన్ని ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కొన్ని ఆలయాలు వైదికమైన సంప్రదాయలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆలయాలు కొన్ని కర్ణాటకలోనూ ఉన్నాయి. కర్ణాటక అంటే మనకు గుర్తుకు వచ్చే కొన్ని ఆలయాల్లో ఒకటి ఉడిపి శ్రీకృష్ణ మందిరం. ఉడిపి ఆలయం అంటే మనకు గుర్తుకు వచ్చేది అక్కడి ప్రసాదమే. ప్రసాదం అంటే లడ్డూ ప్రసాదం కాదు. భోజనమే. ఇక్కడికి వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తారు. అయితే, ఈ భోజనం వడ్డించే తీరే ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉంది. ఉడిపి క్షేత్రం ఉన్న ప్రదేశాన్ని పూర్వం రోజుల్లో దేవాలయాల భూమి లేదా పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం సుమారు వెయ్యేళ్ల క్రితం నిర్మించారు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు.
అయితే, ఉడిపి శ్రీకృష్ణుడికి సంబంధించిన నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. ఆలయంలో స్వామివారి పూజ తరువాత ప్రసాదాన్ని వడ్డిస్తారు. కర్ణాటక సంప్రదాయంలో ఆహారం వడ్డించే విధానం విచిత్రంగా ఉంటే ఉడిపిలో మరో అడుగు ముందుకు వేసి మరింత విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా ప్రసాదాన్ని అరటి ఆకులు లేదా పాత్రల్లో వడ్డిస్తారు. ఈ రెండు పద్దతుల్లో ఏ పద్దతిలోనైనా మనం ఆహారం తీసుకోవచ్చు. కానీ, ఉడిపి వచ్చి కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తరువాత మరోసారి తప్పకుండా ఉడిపి రావాలని పండితులు చెబుతున్నారు. ఉడిపి వచ్చి స్వామిని దర్శించుకున్న తరువాత భోజనం చేసే సమయంలో ఆహారాన్ని నేలపై వడ్డించాలని చెబుతారు. కోరిక నెరవేరిన వ్యక్తులు నేలపైనే భోజనం వడ్డించుకొని తీసుకుంటారు. ఇక్కడ బోజనం శాలలోని నేలను నల్ల కడప రాయితో నిర్మించారు. దీంతో నేల అద్దంలా మెరిసిపోతుంది. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు నేలపై వడ్డించమని అడిగి మరీ తింటారట. ప్రతీరోజూ ఎంతోమంది ఇలా నేలపై భోజనం చేస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. స్వామిని మనసారా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ఉడిపి పండితులు చెబుతున్నారు.
ఉడిపిలో బాలకృష్ణుడిగా స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామిని భక్తులు నేరుగా దర్శనం చేసుకోరు. ఈ ఆలయంలో తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారానే బాల కన్నయ్యని దర్శించుకొని పూజిస్తారు. ఈ తొమ్మిది రంధ్రాలను తొమ్మిది గ్రహాలతో అనుసంధానించబడి ఉంటుందని చెబుతారు. ఈ కిటికీ ద్వారానే భక్తులు స్వామిని దర్శించుకొని సంతృప్తి చెందుతారు. అంతేకాదు, ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం తల గోడవైపుకు తిప్పినట్టుగా ఉంటుంది. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం కనకదాసు అనే ఓ గొప్ప భక్తుడు ఉండేవాడు. అయితే, ఆ భక్తుడిని ఆలయంలోకి అనుమతించలేదట. ఆ తరువాత కనకదాసు ఆలయం వెనుకకు వెళ్లి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ తపస్సు చేశాడట. కనకదాసు తపస్సుకు మెచ్చిన శ్రీకృష్ణుడు తలను గోడవైపుకు తిప్పినట్టుగా ఆలయ పండితులు చెబుతారు. గోడవైపు నుంచి కన్నయ్యను దర్శనం చేసుకునేందుకు కిటికీ తయారు చేయబడిందని పండితులు అంటారు. ఈ కిటికీ ద్వారానే భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు.