గోవిందా గోవిందా అంటూ నిత్యం లక్షలాది మంది భక్తులు Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వ్యయప్రయాసలుకోర్చి ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. తనను నమ్మి తనకోసం వచ్చిన భక్తులను రక్షిస్తూ… ఎంత భద్రంగా కొండకు వచ్చారో…ఎంత భక్తితో ఆయన్ను దర్శించుకున్నారో అంతే భద్రంగా తిరిగి ఇంటికి చేరుస్తారని భక్తులు నమ్ముతారు. అయితే, ఇప్పుడు స్వామివారి భక్తులను ఓ చిరుత భయపెడుతోంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీనివాసుడు కొలువైన శేషాచలం పర్వతాల్లో దట్టమైన అడవులు ఉన్న సంగతి తెలిసిందే. అడవులు ఉన్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా జంతువులు ఉండనే ఉంటుంటాయి. అయితే, సాధు జంతువులతో పాటు కౄరమృగాలు కూడా అక్కడ మనకు కనిపిస్తుంటాయి. వాటితో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ఇప్పటికే ఆలయ అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా సమయంలో స్వామివారి దర్శనాన్ని నిలిపివేయడంతో ఎక్కడో అడవుల్లో తిరిగే జీవులు స్వేచ్ఛగా రోడ్డుపైకి వచ్చాయి. చాలా కాలం తరువాత ఆయా జంతువులు రోడ్డుపైకి రావడంతో జనాలు ఆశ్చర్యపోయారు.
అంటే ప్రకృతి రీసైక్లింగ్ జరిగి ప్యూరిటీగా మారింది. కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు కుదురుకోవడంతో షరామామూలే అయింది. కాగా, అడవుల్లో తిరిగే జంతువులకు గత కొంతకాలంగా వాటికి కావలసిన వేట అడవుల్లో దొరకడం లేదు. దీంతో అడవిలో ఉండి ఇబ్బందులు పడే బదులు రోడ్డుమీదకు వస్తే ఏదో ఒక ఆహారం దొరక్కబోతుందా అని ఆలోచిస్తున్నాయి. మనుషులకే కాదండోయ్ ఇలాంటి కౄరజంతువులు కూడా తమ బుద్ధిని ఉపయోగిస్తుంటాయి. ఆహారాన్ని సంపాదించుకుంటుంటాయి. కొంతకాలం క్రితం అలిపిరి మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆ తరువాత అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పుడు చాలా కాలం తరువాత మరోసారి చిరుత తిరుమలలో దర్శనం ఇచ్చింది. అదీ స్వామివారి ఏకశిలాతోరణంపైనే. హాయిగా ఆ తోరణంపై చిరుత రెస్ట్ తీసుకుంటూ దర్శనం ఇచ్చింది. తోరణంపై తాపీగా కూర్చున్న చిరుతను చూసి భక్తులు భయబ్రాంతులకు గురౌతున్నారు. శిలాతోరణంపై కూర్చొన్న చిరుత కాసేపటి తరువాత సర్వదర్శనం క్యూలైన్ల సమీపంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా అటవీశాఖాధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.