ఇటీవల ఉత్తరభారతదేశంలో సంభవించిన వరదల కారణంగా మనుషులు మాత్రమే ఇబ్బందులు పడలేదు… అడవిలోని చాలా జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. వరద ముప్పుకు గురైన వారిని ప్రభుత్వాలు ఆదుకుంటే… వరద కారణంగా తల్లికి దూరమైన పిల్ల ఏనుగును అటవీశాఖాధికారులు ఆదుకున్నారు. అడవిలో ఒంటరిగా తిరుగుతున్న పిల్ల ఏనుగును రక్షించారు అటవీశాఖ అధికారులు. అయితే, తల్లికోసం తల్లడిల్లుతున్న పిల్ల ఏనుగు మనసు అర్థంచేసుకొని ఆ తల్లిని వెతికి పట్టుకొని దాని దగ్గరకు చేర్చే ప్రయత్నం చేయగా… ఆ తల్లి పిల్లను దగ్గరకు రానివ్వలేదు…పైగా దాడి చేసేందుకు ప్రయత్నించింది.
పరిస్థితి ప్రమాదకరమని భావించిన అటవీశాఖాధికారులు ఆ పిల్ల ఏనుగును సురక్షితంగా రక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం రక్షిత కేంద్రంలో సేదతీరుతోంది. అటవీశాఖ అధికారులు చిన్నారి ఏనుగుకు పాలు, కావలసిన ఆహారం అందిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి ప్రేమ దక్కకపోయినా…మానవతా ప్రేమతో కాపాడిన అటవీశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమాభిమానాలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.