చైనాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వెలువడిన ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. ఈ వీడియోలో కనిపిస్తున్న సమాధులు సాధారణ సమాధులు కాదు… పూర్తిగా పారదర్శకమైన గాజు సమాధులు. ఈ సమాధుల్లో మృతదేహాలు కాలక్రమేణా ఎలా అస్తిపంజరాలుగా మారుతున్నాయో బయట నుంచే స్పష్టంగా చూడొచ్చు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భయంతో, ఆశ్చర్యంతో వెన్నులో వణుకు పుట్టించుకున్నారు.
స్థానిక సంప్రదాయం ప్రకారం, ఈ పారదర్శక సమాధులు మరణించిన వారికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావిస్తారు. మృతులను గాజు పెట్టెలాంటి సమాధుల్లో ఖననం చేస్తే, వారి ఆత్మ శాంతి పొందుతుందని, కుటుంబానికి అదృష్టం చేకూరుతుందని నమ్మకం. కొన్ని సమాధుల్లో భార్యాభర్తలు కలిసి ఖననం చేయబడటం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి చనిపోయి ఉంటే, వారిని విడగొట్టకుండా ఒకే సమాధిలో ఉంచడం అక్కడి ప్రత్యేక ఆచారం.
అనేక ఆసియా దేశాల్లో మృతదేహాలను ప్రత్యేక గదుల్లో ఉంచి ఆచారాలు నిర్వహించే సంస్కృతి ఉన్నప్పటికీ, ఇలా పారదర్శక సమాధులు మాత్రం చాలా అరుదు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ ఆచారాన్ని “శతాబ్దాల సంప్రదాయం”గా గౌరవిస్తుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటి దృశ్యాలను చూడడం భయంకరం” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రియమైనవారు అస్తిపంజరాలుగా మారడాన్ని తన కళ్లతో చూడాలని ఎవరూ అనుకోవడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.