పాటలు పాడడంలో నందమూరి బాలకృష్ణ ఎంత ఉత్సాహాన్ని చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో పలు కార్యక్రమాల్లో తన సినిమాల పాటలను స్వయంగా పాడుతూ ఆ ఈవెంట్లకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ సినిమాలో “మామా ఎక్ పెగ్ లా” పాటను పాడి, దాన్ని చార్ట్‌బస్టర్ హిట్‌గా చేసారు.
ఆ తర్వాత బాలకృష్ణ తన సినిమాల్లో మళ్లీ పాట పాడకపోయినా, కొన్ని ఈవెంట్లలో మాత్రం తన గాత్రంతో సందడి చేశారు. ఇప్పుడు మళ్లీ ఒక సినిమాకు సింగర్ గా మారేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా బాలకృష్ణ – తమన్ కాంబినేషన్ టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన జంటల్లో ఒకటిగా నిలిచింది. వరుసగా ఐదు సినిమాలకు కలిసి పనిచేయడం ఈ రోజుల్లో అరుదైన విషయం.

ఇప్పుడు ఆరోసారి వరుసగా NBK111 కోసం బాలకృష్ణ, తమన్ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీర సింహా రెడ్డి సినిమాతో బాలకృష్ణతో పనిచేసిన గోపిచంద్, తమన్‌తో కూడా క్రాక్, బలుపు, వీర సింహా రెడ్డి వంటి సినిమాల్లో పనిచేసారు. తాజాగా తమన్, ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పాట పాడనున్నట్టు హింట్ ఇచ్చారు.
దీనిపై స్పందించిన తమన్ మాట్లాడుతూ,
“బాలకృష్ణ గారు చాలా బాగా పాడతారు. NBK111లో ఆయనతో ఒక పూర్తి స్థాయి పాట పాడించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది రాజ్యాల నేపథ్యంతో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా. బాహుబలి 2లో దలేర్ మెహందీ పాడిన ‘సాహోరే బాహుబలి’ తరహాలో పవర్‌ఫుల్ వైబ్రేషన్స్ ఉన్న పాటగా దీన్ని రూపొందించాలనుకుంటున్నాను” అని తెలిపారు. దీంతో NBK111లో బాలకృష్ణ పాట పాడటం ఖాయమైంది.
NBK111 ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ రెండు వారాల్లో ప్రారంభం కానుంది. కాంతార సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.