•గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నాము
•పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము
•కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశాము
•5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామనీ, అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో5వ కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభినందనలు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండగ 1.0 పనులను గడువులోపు పూర్తి చేయగలిగామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నరేగా నిధులతో గత ఏడాది చేపట్టిన పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయగలిగాం. రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించాం. సకాలంలో పనులు పూర్తి చేయగలిగాము. 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ. 4,330 కోట్ల వేతనాల రూపంలో చెల్లించాం. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 1,056.85 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాం. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేయూతను ఇచ్చింది.

•స్వచ్ఛ రథం సత్ఫలితాలనిస్తోంది:
గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తాం. టాక్స్, నాన్ టాక్స్ అసైన్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఉద్యోగుల సామర్థ్యం పెంపుకి ఈ శిక్షణా తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పాలనా సామర్థ్యాల పెంపు కోసం కలెక్టర్లు కృషి చేయాలి. జూన్ నెలలో తీసుకువచ్చిన స్వచ్ఛ రథం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జూన్ లో ఒక యూనిట్ తో ప్రారంభించగా నేటికి ఆ సంఖ్య 25కి చేరింది. పీఎం జన్మన్ పథకం, నరేగా సాయంతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం.

రహదారుల నిర్మాణానికి అవసరం అయిన అటవీ అనుమతుల వ్యవహారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 9కి 9 అనుమతులు పూర్తి చేసి 100 శాతం స్ట్రయిక్ సాధించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ 88కి 79 పనులకు అనుమతులు క్లియర్ చేశారు. అడవి తల్లి బాట పనులపై కలెక్టర్లు శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం. మరింత ఉత్సాహంగా పని చేస్తూ నిబద్దతతో ప్రజలకు సేవలు అందించాలి” అన్నారు.