కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఆలయంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 11 వరకు మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు వివిధ రకాలైన ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేలోగా ఈ ఉత్సవాలను పూర్తిచేస్తారు. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. స్వామివారి నిత్యార్చనలో భాగంగా, ఉత్సవాల్లో ఊరెరిగింపుకోసం ఉత్సవమూర్తులను అభిషేకిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి వాటి పవిత్రత దెబ్బతినకుండా కాపాడతారు. ఇలా ప్రత్యేకాభిషేకం నిర్వహించడం వలన ఉత్సవమూర్తుల దేహానికి ఎలాంటి హాని లేకుండా పదుల సంవత్సరాలపాటు నిలిచిపోతుంది. జ్యేష్టాభిషేకంలో భాగంగా స్వామివారి బంగారు, ముత్యాలు, వజ్రకవచాలను శుద్దిచేస్తారు. ఇలా శుద్ధి చేయడం ద్వారా దేవతా విగ్రహానికి నూతన జీవం పోసుకుంటుందని పండితులు చెబుతున్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు జూన్ 9న శ్రీ మలయప్పస్వామి బంగారు కవచాన్ని తొలగిస్తారు. హోమాలు, పంచామృతాభిషేకాలు, తిరుమంజనాలు నిర్వహిస్తారు. ఆ తరువాత వజ్రకవచాన్ని తిరిగి అలంకరిస్తారు. ఇక రెండో రోజున స్వామివారికి ముత్యాల కవచాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో తిరుమంజనాలతో పాటుగా ప్రత్యేకమైన అర్చనలు నిర్వహిస్తారు. మూడో రోజైన బుధవారం నాడు తిరుమంజనాలు పూర్తిచేసి బంగారు కవచాన్ని కవచానికి అలంకరిస్తారు. అభిషేకం తరువాత బంగారు కవచాన్ని స్వామివారికి అలంకరించిన తరువాత తిరిగి వచ్చే జ్యేష్టాభిషేకం జరిగేవరకు తొలగించరు. ఏడాది పొడవునా ఈ కవచంతోనే స్వామివారు వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు, దివ్యదర్శనం లభించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ అభిషేకం తరువాత దివ్యమూర్తుల మహిమ, కవచాల పవిత్రత, భక్తుల విశ్వాసం మరింతగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవాన్ని తిలకిస్తే భక్తులకు పుణ్యఫలం లభిస్తుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.