బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో సంస్కారం ఉండాలన్న కేటీఆర్, తాను ఎప్పుడూ కుటుంబ సభ్యులు, మహిళలు లేదా పిల్లలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ కేసుల్లో అసలు విషయం ఏమీ లేదని రేవంత్‌కు అర్థమైందని, అందుకే ఈ కేసులను సాగదీస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక కాలు కాంగ్రెస్‌లో, మరో కాలు బీజేపీలో పెట్టి రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చుని తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామనడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నిజంగా మెజారిటీ మద్దతు ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పరిశ్రమలు ఏపీకి తరలిపోవడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేయడం వంటి అంశాలు రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనాలని కేటీఆర్ మండిపడ్డారు.