ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో 2026 సంవత్సరం SUV ప్రియులకు మరింత ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV విభాగంలో పోటీ తీవ్రమవుతున్న వేళ, ఫ్రెంచ్ కార్ తయారీదారు రెనాల్ట్ తన ఉనికిని బలంగా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం Kwid, Kiger, Triber మోడళ్లతో మాత్రమే కొనసాగుతున్న రెనాల్ట్, 2026లో రెండు పూర్తిగా కొత్త SUVలను మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందులో ప్రధాన ఆకర్షణగా ఒకప్పుడు భారతీయ రోడ్లపై మంచి గుర్తింపు సంపాదించిన డస్టర్ తిరిగి రానుంది. 2022లో నిలిచిపోయిన ఈ మోడల్, కొత్త జనరేషన్ అవతారంలో 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశముంది. అంచనా ప్రకారం రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల ధర శ్రేణిలో ఈ SUV అందుబాటులోకి రావొచ్చు. ప్రీమియం ఇంటీరియర్లు, ఆధునిక ఫీచర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
డస్టర్‌లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఎంట్రీ వేరియంట్లకు 1.0 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. అంతేకాదు, డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రెనాల్ట్ ఒక కొత్త 7 సీటర్ SUVను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది 2026 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశముండగా, పెద్ద కుటుంబాలకు కొత్త ఎంపికగా నిలవనుంది.
ఈ రెండు మోడళ్లతో రెనాల్ట్, భారత SUV మార్కెట్‌లో మళ్లీ బలమైన పోటీదారుగా అవతరించనుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.