భారతీయ రైల్వే వ్యవస్థకు ఆధునిక రూపు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నేడు దేశ గర్వకారణంగా నిలిచాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడం సవాలుతో కూడిన పని. అందుకే అత్యంత అనుభవం, నైపుణ్యం, అప్రమత్తత ఉన్న లోకో పైలట్లకే ఈ బాధ్యతను రైల్వే శాఖ అప్పగిస్తుంది. వందే భారత్ పైలట్ అవ్వడం ఒక్కరోజులో జరిగే విషయం కాదు. ఒక క్రమబద్ధమైన కెరీర్ మార్గం ద్వారా మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది.
సాధారణంగా కెరీర్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ప్రారంభమవుతుంది. సీనియర్ పైలట్లతో కలిసి పనిచేస్తూ ప్రాథమిక శిక్షణ, అనుభవం పొందుతారు. ఆ తర్వాత షంటింగ్, ఫ్రైట్ రైళ్లను నడిపే లోకో పైలట్‌గా బాధ్యతలు చేపడతారు. అనేక ఏళ్ల సేవ, పనితీరుతో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎంపికవుతారు. చివరికి వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం వస్తుంది.
వందే భారత్ పైలట్ల బాధ్యతలు ఎంతో కీలకం. ఆధునిక కంప్యూటరైజ్డ్ ఇంజిన్ వ్యవస్థల పర్యవేక్షణ, వేగ నియంత్రణ, బ్రేకింగ్ వ్యవస్థపై పూర్తి పట్టు, కంట్రోల్ రూమ్‌తో నిరంతర కమ్యూనికేషన్ వంటి అంశాలు వారి పనిలో భాగం. జీతభత్యాల విషయానికి వస్తే 7వ పే కమిషన్ ప్రకారం సీనియర్ పైలట్లకు నెలకు రూ. 65,000 నుంచి రూ. 85,000 వరకు వేతనం లభిస్తుంది. అత్యున్నత స్థాయి అధికారులకు ఇది రూ. 2 లక్షలకు పైగా ఉంటుంది. జీతంతో పాటు అలవెన్సులు, గౌరవం కూడా ఈ వృత్తికి ప్రత్యేక ఆకర్షణ.