భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మహిళల క్రికెట్‌కు చారిత్రాత్మక ప్రాధాన్యం ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మహిళల క్రికెట్‌లో ఆటగాళ్ల వేతనాలను భారీగా పెంచుతూ, పురుష క్రికెటర్లతో సమానంగా పారితోషికం అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తోంది. ఇటీవల టీమిండియా మహిళల జట్టు 2025 వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత విజయాన్ని సాధించి దక్షిణాఫ్రికాను ఫైనల్‌లో 52 పరుగుల తేడాతో ఓడించిన నేపథ్యంలో, బీసీసీఐ ఈ శుభవార్తను ప్రకటించడం విశేషం. అదే సమయంలో అంధుల మహిళల జట్టు కూడా వరల్డ్ కప్ గెలవడం భారత క్రీడా చరిత్రలో గర్వకారణంగా నిలిచింది.
తాజా నిర్ణయం ప్రకారం, దేశీయ క్రికెట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న సీనియర్ మహిళా ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్‌కు రూ. 50,000 వేతనం అందనుంది. గతంలో ఇది కేవలం రూ. 20,000 మాత్రమే. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని రిజర్వ్ ఆటగాళ్లకు కూడా పెద్ద ఊరట కల్పిస్తూ, వారి మ్యాచ్ ఫీజును రూ. 25,000కి పెంచింది. గతంలో వారికి రూ. 10,000 మాత్రమే లభించేది.
జూనియర్ మహిళా క్రికెటర్లకూ ఈ పెంపు వర్తిస్తుంది. ఒక రోజు మ్యాచ్‌ల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న జూనియర్ ఆటగాళ్లకు రూ. 25,000, రిజర్వ్ ఆటగాళ్లకు రూ. 12,500 అందిస్తారు. జూనియర్ టీ20 మ్యాచ్‌ల్లో ఆడే ఆటగాళ్లకు రూ. 12,500, బెంచ్‌పై ఉన్నవారికి రూ. 6,250 చెల్లించనున్నారు. డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. త్వరలో మహిళా మ్యాచ్ అధికారులు, అంపైర్లు, రిఫరీల వేతనాల పెంపుపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.