దేశంలో మధుమేహం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రస్తుతం భారత్‌లో పది కోట్ల మందికిపైగా డయాబెటిస్తో బాధపడుతున్నారని అంచనా. వీరిలో చాలా మందికి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి. అయితే రోజూ సూది గుచ్చుకోవాల్సిన పరిస్థితి చాలా మందికి భయాన్ని, అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఒక్కరోజు ఇన్సులిన్ మిస్ అయినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహ రోగులకు ఊరటనిచ్చేలా ప్రముఖ ఔషధ సంస్థ సిప్లా లిమిటెడ్ సరికొత్త ఇన్సులిన్ పౌడర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
‘అఫ్రెజా’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్‌కు గత ఏడాదే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి లభించింది. ఇప్పుడు దేశీయంగా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇది సింగిల్ డోస్ క్యాట్రిడ్జ్ రూపంలో లభిస్తుంది. చిన్న ఇన్హేలర్లో క్యాట్రిడ్జ్‌ను అమర్చి నోటి ద్వారా పీల్చుకుంటే సరిపోతుంది. ఇంజెక్షన్ల అవసరం లేకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత.
ముఖ్యంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సిప్లా పేర్కొంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఇన్సులిన్ పౌడర్‌ను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపింది. సిప్లా గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అచిన్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, మానసిక ఒత్తిడిని ఈ కొత్త విధానం తగ్గిస్తుందని తెలిపారు. మొత్తంగా ఇన్సులిన్ పౌడర్ డయాబెటిస్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.