“నీ అభిరుచిని నీ లక్ష్యంగా మార్చుకో. ఒక రోజు అదే నీ వృత్తిగా మారుతుంది” అనే మాటను అక్షరాలా నిజం చేసిన వ్యక్తి సుమంత్ బోర్రా. అయితే అభిరుచిని అనుసరించడం అంత సులభం కాదు. ముఖ్యంగా భారతీయ సమాజంలో కెరీర్ విషయంలో ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వృత్తులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఐఏఎస్, ఐఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ప్రభుత్వ ఉద్యోగాలు, సీఏ, సిఎస్, ఎంబీఏ లాంటి రంగాలకే సమాజం పరిమితమవుతుంది. కళ, సంగీతం వంటి సృజనాత్మక రంగాలను చాలామంది అనిశ్చితితో కూడినవిగా చూస్తారు.
హైదరాబాద్‌లో జన్మించి పెరిగిన సుమంత్ బోర్రా చిన్ననాటి నుంచే సంగీతంపై అపారమైన ప్రేమ కలిగిన వ్యక్తి. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆయన తల్లిదండ్రులు “డబ్బు ఒక్కటే గౌరవాన్ని ఇవ్వదు, ప్రత్యేకత ఉంటేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది” అనే ఆలోచనతో ఆయనను పెంచారు. సుమంత్‌కి సంగీతం పట్ల ఆసక్తి పెరగడానికి కారణమైంది. పాటలు రాయడం, పాడటం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సంగీతమే కాకుండా… సనాతనంలో వృత్తిధర్మాన్ని మర్చిపోకుండా పూజారిగా కూడా తనవంతు బాధ్యతను పోషిస్తున్నాడు.

అయితే సమాజపు ఒత్తిడి, భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి కారణంగా సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి వెనుకడుగు వేశారు. అందుకే చాలామందిలాగే ఇంజినీరింగ్‌ను బ్యాకప్ ప్లాన్‌గా ఎంచుకున్నారు. “ముందు ఇంజినీరింగ్ చేయాలి, తర్వాత ఇష్టం ఉన్నదేదైనా చేయవచ్చు” అనే మనస్తత్వం అప్పట్లో ఆయనలోనూ ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత చదువుతో పాటు సంగీతాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
కళాశాలలో జరిగే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనమని స్నేహితులు ప్రోత్సహించారు. మొదటిసారి వేదికపైకి వెళ్లినప్పుడు ప్రేక్షకుల అరుపులు ఆయనను కాస్త నిరుత్సాహపరిచాయి. కానీ ఒక సీనియర్ ఇచ్చిన ధైర్యం ఆయన జీవితాన్నే మార్చింది. “నమ్మకంగా పాడు, వాళ్లు తప్పకుండా ఇష్టపడతారు” అన్న మాటలతో మళ్లీ పాట మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రేక్షకుల చప్పట్లు ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.
ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. వందకు పైగా పోటీల్లో పాల్గొని అనేక అవార్డులు సాధించారు. అదే సమయంలో సొంతంగా పాటలు రాయడం, స్వరపరచడం మొదలుపెట్టారు. మూడు సంవత్సరాల పాటు నిరంతరంగా రచన, సంగీత సాధన చేశారు.

ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఒక కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. ఉద్యోగం, సంగీతం రెండింటినీ సమతుల్యం చేయడం కష్టమైనప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. వీకెండ్లలో పాటలు కంపోజ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. కరోనా సమయంలో విడుదల చేసిన ఆల్బమ్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సంగీత సంస్థ ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. “అధర్వ మోరియా”, “విశ్వం”, “మళ్లీ రావా”, “గణనాయక” వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ…తన అభిరుచిని కొనసాగిస్తూ… వృత్తిధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆర్థిక భద్రతను కోల్పోకుండా అభిరుచిని ముందుకు తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. భవిష్యత్తులో మంచి సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాలనేది ఆయన ఆశ. సుమంత్ ఆశ నెరవేరాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.