జపాన్‌లో ఒకరినొకరు కలిసినప్పుడు చేతులు కలపకుండా వంగి నమస్కరించడం వెనుక ఎంతో లోతైన సంస్కృతి, గౌరవ భావన దాగి ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ఓజిగి’ అని పిలుస్తారు. జపనీస్ జీవన విధానంలో తల శరీరంలోని అత్యంత పవిత్రమైన భాగంగా భావిస్తారు. అందుకే తలను వంచడం అనేది వినయం, మర్యాద, ఆత్మ నియంత్రణకు ప్రతీకగా చూస్తారు. పెద్దలను కలిసినప్పుడు, ఉపాధ్యాయులు లేదా అధికారులను అభివాదం చేసేటప్పుడు, ధన్యవాదాలు చెప్పేటప్పుడు, క్షమాపణ కోరేటప్పుడు వంగడం సహజమైన ఆచారం. ఎంత లోతుగా వంగాలి అనేది సంబంధం, సందర్భం, ఎదుటి వ్యక్తి స్థాయి ఆధారంగా మారుతుంది.
స్వల్పంగా వంగడం సాధారణ మర్యాదకు సూచన అయితే, లోతుగా వంగడం అత్యంత గౌరవం లేదా హృదయపూర్వక క్షమాపణకు సంకేతం. ఈ సంప్రదాయం ఐదవ శతాబ్దంలో చైనా నుంచి జపాన్‌కు వచ్చిన బౌద్ధమత ప్రభావంతో మొదలైనట్టు చరిత్ర చెబుతుంది. తరువాత కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు, సమురాయ్ క్రమశిక్షణ, ఎడో కాలం సామాజిక వ్యవస్థలతో ఇది మరింత బలపడింది. కాలం మారినా ఈ సంప్రదాయం మారలేదు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలోనూ జపాన్ ప్రజలు ఈ ఆచారాన్ని గర్వంగా పాటిస్తున్నారు. అందుకే జపాన్‌లో వంగి నమస్కరించడం కేవలం అభివాదం మాత్రమే కాదు… అది వారి సంస్కృతి, జీవన విలువలు, ఆలోచనా విధానానికి ప్రతిబింబం.