రణవీర్ సింగ్ తాజా బ్లాక్‌బస్టర్ ధురంధర్ విజయంలో కీలక పాత్ర పోషించిన నటుడు అక్షయ్ ఖన్నా, తన శక్తివంతమైన నటనతో బాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన సినిమాకు పెద్ద ప్లస్‌గా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, ధురంధర్ భారీ బాక్సాఫీస్ విజయం మధ్యలో మరో కీలక పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న దృశ్యం 3 (హిందీ) సినిమా నుంచి అక్షయ్ ఖన్నా అనూహ్యంగా తప్పుకోవడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం, పారితోషిక విషయంలో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా అక్షయ్ ఖన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి.
తాజా బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, పనోరమా స్టూడియోస్ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అధికారికంగా స్పందించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, దృశ్యం 3లో అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్ నటించబోతున్నారు. ఒప్పందం సైన్ చేసిన తర్వాత అక్షయ్ ఖన్నా అనవసరమైన అధిక పారితోషికం డిమాండ్ చేశారని, ఎన్నో చర్చలు జరిగినా చివరకు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని నిర్మాత ఆరోపించారు.

ఇంకా, అక్షయ్ ఖన్నాతో పోలిస్తే జైదీప్ అహ్లావత్ ఒక “మెరుగైన నటుడు, మెరుగైన వ్యక్తి” అని నిర్మాత వ్యాఖ్యానించినట్టు సమాచారం. జైదీప్ అహ్లావత్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కనిపించే ముందు చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత గబ్బర్ ఇస్ బ్యాక్, విశ్వరూపం 2 వంటి చిత్రాల్లో కీలక సహాయ పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించాడు.
ఇక అక్షయ్ ఖన్నా వ్యవహారంపై నిర్మాతలు న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మూడో భాగంలో అక్షయ్ ఖన్నా తప్పనిసరిగా విగ్ ధరిస్తాను అంటూ పట్టుబట్టాడని, అది కథలో కంటిన్యుటీ సమస్యలు తెచ్చే అవకాశం ఉందని దర్శకుడు అంగీకరించలేదని నిర్మాత ఆరోపించారు. దృశ్యం సిరీస్‌లో అక్షయ్ ఖన్నా, సామ్ హత్య కేసును విచారించే IG తరుణ్ అహ్లావత్ పాత్రలో నటించాడు.
దృశ్యం ఫ్రాంచైజ్ మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో అద్భుత విజయాన్ని సాధించింది. హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అభిషేక్ పాఠక్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలకానుంది.