విజయనగరం బ్యాంక్ కాలనీలోని తోటపాలెం ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ సమీపంలో ఉన్న వాకర్స్ క్లబ్‌లో సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీబాలాజీ టెంపుల్ చైర్మన్, ఆర్‌ఎస్‌ఎస్ నగర సంఘ్ చాలక్ భగవాన్ అధ్యక్షత వహించగా, శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు భాస్కరాచార్యులు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ విజయనగరం జిల్లా ప్రధాన వక్త ముగడ రమణ మాట్లాడుతూ మొగలాయిలు, తెల్లదొరలు పాలించకముందే ఈ దేశం వేలాది సంవత్సరాలుగా హిందూ దేశంగా వెలుగొందిందని అన్నారు.
మహిళా వక్త వికాసతరంగిణి అక్కయ్య అరుణ మాట్లాడుతూ సమాజ హితం, దేశభక్తి కోసం వ్యక్తి నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని వివరించారు. యువత ప్రతిరోజూ సమాజం కోసం ఒక గంట కేటాయించాలని పిలుపునిచ్చారు. భాస్కరాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని కుటుంబంలోనే ఆచరించి పిల్లలకు నేర్పాలని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక్ గీతాలాపన, ప్రసాదం, బిస్కెట్ పంపిణీ నిర్వహించగా, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.