మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నాళ్లుగానో రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగానూ విభేదాల్లో ఉన్న ‘‘పవార్’’ కుటుంబం మరోసారి ఒక్కటవుతుందా అనే చర్చ మొదలైంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మరియు మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొత్తు కుదరడం ఈ చర్చకు కారణమైంది.
జనవరి 15న జరగనున్న మహారాష్ట్రలోని 29 మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో భాగంగా పింప్రి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి బరిలో దిగనున్నాయి. గతంలో ఎన్‌సీపీలో చీలిక ఏర్పడి అజిత్ పవార్ వర్గం ఎన్డీయే కూటమిలో చేరగా, శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా గుర్తించి గడియారం గుర్తును కేటాయించగా, శరద్ పవార్ వర్గం ‘తుతారి’ గుర్తుతో పోటీ చేస్తోంది.
ఈ నేపథ్యంలో పింప్రి-చించ్వాడ్ ఎన్నికల కోసం ‘‘గడియారం, తుతారి ఏకమయ్యాయి, పరివారం మళ్లీ కలిసింది’’ అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అభివృద్ధే తమ అజెండా అని, మునిసిపల్ కార్పొరేషన్‌ను అప్పుల పాలుచేసిన వారిని ఓడిస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం ఎన్డీయే కూటమిలో భిన్న సంకేతాలను పంపుతోంది. ఈ పరిణామాలపై రాజకీయ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేత నవనీత్ రాణా శరద్ పవార్ కూడా త్వరలో ఎన్డీయేలో చేరవచ్చని వ్యాఖ్యానించగా, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం ఇంటిపేరు రాజకీయాలు మహారాష్ట్రలో పనిచేయవని విమర్శించారు. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.