ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే లక్ష్యంతో, అలాగే అధికారుల పర్యవేక్షణను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎంతో కాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉన్న మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
అయితే తాజా మార్పుల నేపథ్యంలో మదనపల్లె పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయకుండా, అన్నమయ్య జిల్లాకే మదనపల్లెను హెడ్‌క్వార్టర్స్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగనుంది. అన్నమయ్య జిల్లా విభజన ద్వారా మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడనుండగా, ఇందులో మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో పాటు రాయచోటి ప్రాంతాన్ని కూడా చేర్చనున్నారు. అదే సమయంలో రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు బదిలీ చేయాలని, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మార్పులతో ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గి, ప్రభుత్వ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం, కనిగిరి డివిజన్లతో ‘మార్కాపురం’ జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గిరిజన ప్రాంతాల పాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు రంపచోడవరం కేంద్రంగా ‘పోలవరం’ జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జిల్లాలో రంపచోడవరం, చింతూరు డివిజన్లు ఉండనున్నాయి. కొత్త జిల్లాలతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుండగా, అనంతరం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.