2025 సంవత్సరంలో హాలీవుడ్ నుంచి వరుసగా భారీ బడ్జెట్ సీక్వెల్స్ థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఇయర్ ఎండ్ కి అత్యధిక వసూళ్లు సాధించే సినిమా హాలీవుడ్ నుంచే వస్తుందని అందరూ భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఒక చైనీస్ యానిమేటెడ్ సీక్వెల్ కావడం సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
అవును, మీరు విన్నది నిజమే… Avatar 3, Jurassic World: Rebirth, Mission: Impossible – The Final Reckoning, The Fantastic Four: First Steps వంటి భారీ హాలీవుడ్ సినిమాలు కాకుండా, 2025లో అతిపెద్ద మనీ మేకర్‌గా నిలిచింది ‘Ne Zha 2 ‘ అనే చైనీస్ యానిమేటెడ్ సినిమా. సుమారు రూ.700 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2.2 బిలియన్ (రూ.18,000 కోట్లు) వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఆశ్చర్యకరంగా, రెండో స్థానంలో నిలిచిన సినిమా కూడా యానిమేషన్ జానర్‌కే చెందినది. Zootopia 2 సుమారు $1.5 బిలియన్ వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. డిస్నీ సంస్థ తెరకెక్కించిన Lilo & Stitch మూడో స్థానంలో, వార్నర్ బ్రదర్స్ తీసిన A Minecraft Movie నాలుగో స్థానంలో నిలిచాయి.
Ne Zha 2 సినిమాకు Yu Yang దర్శకత్వం వహించడంతో పాటు కథ కూడా ఆయనే రాశారు. ఈ చిత్రం చైనా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన ‘Ne Zha’ అనే రాక్షస బాలుడి కథ ఆధారంగా తెరకెక్కింది. మాండరిన్ వెర్షన్‌లో లూ యాంటింగ్, జోసెఫ్ కావో వాయిస్ ఇచ్చారు. ఇంగ్లిష్ వెర్షన్‌లో క్రిస్టల్ లీ, గ్రిఫిన్ పువాటూ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమాను Chengdu Coco Cartoon ఇంకా Beijing Enlight Media సంస్థలు నిర్మించాయి.

ఈ చిత్రం హాలీవుడ్ యానిమేషన్ హిట్ Inside Out రికార్డును బ్రేక్ చేస్తూ, ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన అనేక హాలీవుడ్ సినిమాలు $1 బిలియన్ మార్క్‌ను దాటలేకపోయినా, Ne Zha 2 మరియు Zootopia 2 మాత్రం చైనా సహా ఆసియా దేశాల్లో వచ్చిన అద్భుత స్పందనతో ఆ మార్క్‌ను సులువుగా దాటేశాయి.
జనవరిలో విడుదలైన Ne Zha 2, కేవలం రెండు నెలల్లోనే $2 బిలియన్ క్లబ్‌లో చేరి, ఆ ఘనత సాధించిన ప్రపంచంలో ఏడవ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం చైనా యానిమేషన్ పరిశ్రమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, యానిమేషన్ జానర్‌లో ఇంకా ఎంతటి అపారమైన అవకాశాలు ఉన్నాయో నిరూపించింది.
ఇదే కాకుండా, $2 బిలియన్ వసూళ్లు దాటిన తొలి నాన్-ఇంగ్లిష్ యానిమేటెడ్ సినిమాగా Ne Zha 2 నిలిచింది. అలాగే, డిస్నీ కాకుండా ఈ ఘనత సాధించిన రెండో యానిమేటెడ్ సినిమాగా (Shrek 2 తర్వాత) రికార్డు సృష్టించింది.
ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే, హాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన Avatar: Fire and Ash కూడా ‘Ne Zha 2’ స్థాయిలో వసూళ్లు సాధించడం కష్టమే అన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.