పూరీ అంటే గుర్తుకు వచ్చేది జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి. ఈ ముగ్గురితో ఆలయం ముడిపడి ఉంది. ప్రతి ఏడాది ఆషాడమాసం ప్రారంభంలో రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్రను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కేవలం ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కాదు… నిత్యం వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని తరిస్తుంటారు. స్వామిని దర్శనం చేసుకున్న తరువాత నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. స్వామివారికి ఏడు కొత్త కుండల్లో వంటకాలు వండుతారనే సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రసాదం ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇలాంటి రుచికరమైన ప్రసాదాన్ని భోజనంగా స్వీకరించాలని భక్తులకు ఉంటుంది. కానీ, స్వామివారి ఆలయంలో ప్రత్యేక పర్వదినాల్లో తప్పించి మరెప్పుడూ ఉచితంగా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించరు.
ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించకున్నా… స్వామివారి ప్రసాదాలను తయారు చేసే ఆనంద్‌బజార్‌లో పెద్ద ఎత్తున వంటకాలను వండుతారు. స్వామివారి ప్రసాదం కోసం ఎలాంటి వంటకాలు చేస్తారో అవే వంటకాలను పెద్ద ఎత్తున తయారు చేస్తారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆ వంటకాలను సరఫరా చేస్తారు. పెద్ద పెద్ద కుండల్లో వండి గంపల్లో పెట్టుకొని ఆనంద్ బజార్ మార్కెట్లోని హోటళ్లకు సరఫరా అవుతాయి. అక్కడ మనం స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేసి ఆహారంగా స్వీకరించవచ్చు. ఒక్కొక్కరికి రూ. 100 చోప్పున వసూలు చేస్తారు. సుమారు 50 రకాలైన వంటకాలు సిద్దం చేసినా ఒక మనిషి 6 నుంచి 8 రకాలైన వంటకాలతో తృప్తిగా భోజనం చేయవచ్చు. మనకు ఏమేం వంటకాలు కావాలో మనమే సెలక్ట్ చేసుకోవాలి. దాని ప్రకారం మనకు వడ్డిస్తారు. ఆలయానికి వచ్చే ఆదాయంలో ఈ అన్నం ద్వారానే వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన ఆహార పదార్ధాలను ఈ వంటకాల్లో ఉంటాయి. మరెందుకు ఆలస్యం పూరీ వెళ్లి స్వామివారిని దర్శించుకొని మనం కూడా మనకు నచ్చిన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దామం.