2026 ఎండింగ్ కి చేరుకుంటున్న వేళ, ఎక్కువగా ‘Rewind ‘ ఆర్టికల్స్ అన్ని ఎక్కువగా భారీ క్యాస్ట్, భారీ బడ్జెట్ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపించింది ఏంటంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, సరైన ప్లానింగ్ ఉంటె చిన్న సినిమా అయినా కానీ హిట్ అవ్వచ్చు అని!
ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల్లో, ఎలాంటి హడావుడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన ఓ చిన్న సినిమా ఉంది. అదే ‘లిటిల్ హార్ట్స్’.
సుమారు రూ.2.5 కోట్ల అతి చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. ETV Win సపోర్ట్‌తో, కంటెంట్ డ్రివన్ సినిమాలకు పేరుగాంచిన నిర్మాత ఆదిత్య హసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాలో యూట్యూబర్ మౌళి ఇంకా కొత్త హీరోయిన్ శివాని నాగారం ప్రధాన పాత్రల్లో నటించారు. పేరున్న స్టార్లు లేకపోయినా, పాజిటివ్ టాక్ వేగంగా పాకడంతో, కొన్ని రోజుల్లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో కళకళలాడాయి. సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, వాళ్ళ ఇళ్ల నేపధ్యం, ఇంకా కాలేజీ కామెడీ సీన్స్ అన్ని, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి!
ఆ తర్వాత జరిగినది ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. ‘లిటిల్ హార్ట్స్’ రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, దాదాపు రూ.30 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్లను ఈ సినిమా పూర్తిగా ఆక్రమించి, అదే సమయంలో విడుదలైన మిడ్ రేంజ్, భారీ బడ్జెట్ సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసింది.
ఈ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి భారీ లాభాలు పొందారు. నిర్మాతల నుంచి ఎగ్జిబిటర్ల వరకు, ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా మంచి లాభాలతో పాటు ఇండస్ట్రీలో మంచి క్రెడిబిలిటీ కూడా దక్కింది.
ఈ ఏడాది మరికొన్ని చిన్న సినిమాలు డీసెంట్‌గా ఆడినప్పటికీ, ఇన్వెస్ట్‌మెంట్‌కు వచ్చిన రిటర్న్స్ పరంగా ‘లిటిల్ హార్ట్స్’కు ఎవ్వరూ దగ్గర కూడా రాలేకపోయారు. కొన్ని స్టార్ సినిమాలు ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించినా, వాటి బడ్జెట్లు కూడా చాలా ఎక్కువ కావడంతో లాభాల పరంగా అవి వెనుకబడ్డాయి.
ప్యూర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఈ ఏడాది అన్ని సినిమాల కంటే ‘లిటిల్ హార్ట్స్’ ఎత్తులో నిలిచింది. అందుకే లాభాల కోణంలో చూస్తే, ‘లిటిల్ హార్ట్స్’ను ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.