నూతన వాహనాలను ఏ రోజు కొనుగోలు చేయడానికి శుభముహూర్తాలు ఇవే

Auspicious Dates and Muhurats to Buy a New Vehicle

మనం ఏ పనిచేయాలన్నా ముందుగా పంచాంగం చూసుకొని మంచిరోజా కాదా… మంచి నక్షత్రమా కాదా…లగ్నం ఎలా ఉంది… ముహూర్తం ఎలా ఉందని చూసుకొని పనులు మొదలుపెడతాం. పూర్వం రోజుల్లో చాలా మంది ఈ విధంగానే చేసేవారు. కాబట్టే ఆరోజుల్లో తెలిసింత వరకు పెద్దగా ప్రమాదాలు జరగడంగాని, విపత్తులు రావడంగాని, పొల్యూషన్‌ గాని ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడంతా స్పీడ్‌ ప్రపంచం. ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయాల్సిందే. ఆలస్యమైతే అనుకున్నది జరగకపోవచ్చు. కావలసింది చేతికి దొరక్కపోవచ్చు. ఆశ అత్యాశలతో పరుగులు తీస్తూ మన ప్రమాదాలను మనమే కొనితెచ్చుకుంటున్నాం. ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాం. ఒకప్పుడు పేదవాడి వాహనం సైకిలైతే ఇప్పుడు అది మోటార్‌ బండిగా మారిపోయింది. ప్రతి ఇంట్లో టూవీలర్‌ లేదా కార్లు ఉండటం కామన్‌గా మారింది. కాంపిటీషన్‌ ప్రపంచంలో నిత్యం వందలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ముహూర్తాలు చూసుకోకుండా కొనుగోలు చేసిన ఎన్నో వాహనాలు తుక్కుగా మారిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి ఏకైక పరిష్కారం ముహూర్తం చూసుకొని వాహనాలను కొనుగోలు చేయడమే.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తిథి వార నక్షత్రాలు చూసుకొని కొత్త వస్తువులు, వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. వాహనాలను కొనుగోలు చేయడానికి అందరికీ పనికి వచ్చే రోజులు చంద్రసంబంధితమైన సోమవారం, బుద్ది, వ్యాపారానికి శుభకరమైన బుధవారం, లక్ష్మీకటాక్ష దినంగా చెప్పబడే గురువారం, ధనానికి, సుఖానికి యోగానికి అనుకూలమైన శుక్రవారం రోజున నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కానీ, మంగళ, శనివారాలు నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉత్తరాషాడ, రేవతి, హస్త, అనూరాధ, మృగశిర, చిత్త, శ్రవణ, పుష్యమి, రోహిణి నక్షత్రాల్లో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ, తృతీయ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు కూడా మంచివే. అమావాస్య, అష్టమి, చతుర్ధశి తిథుల్లో వాహనాలను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముహూర్తపరంగా చూసుకుంటే అభిజిత్‌ ముహూర్తంలో వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కానీ, చంద్రుడు 4,7,8,12వ ఇంట్లో ఉండే సమయాల్లో వాహనాలను కొనుగోలు చేయకూడదు. అలాగే మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర లగ్నాలు వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. ముహూర్తమే కాదు వర్జ్యాలను కూడా చూసుకోవాలి. రాహుకాలం, యమగండం, గులికకాలం, తిథినష్టం, వారనష్టం ఉన్నరోజులు, వాహనయోగం దోషాలున్న రోజుల్లో నూతన వాహనాలను కొనుగోలు చేయకూడదు. కామన్‌గా ఉండే సమస్యలు ఇవి. కానీ, మనం మన వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మంచిరోజు చూసుకోవాలి. ఆ రోజును బట్టి వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *