2025 సంవత్సరంలో భారతదేశం నుంచి విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ చరిత్ర సృష్టిస్తోంది. న్యూఇయర్ ఈవ్‌కు ముందే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త మైలురాయిని అందుకుంది. విడుదలై 25 రోజులు దాటినా కూడా, ఈ స్పై థ్రిల్లర్ డబుల్ డిజిట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
అయితే, ఈ అద్భుతమైన విజయయాత్ర మధ్యలో ఒక పెద్ద ఎదురుదెబ్బ మాత్రం ధురంధర్‌కు తగిలింది. గల్ఫ్ దేశాల్లో నిషేధం కారణంగా ఈ సినిమా దాదాపు 90 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.
భారతదేశం బయట ఇతర దేశాల్లో సినిమా అద్భుతంగా రాణించినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో విడుదల కాకపోవడం భారీగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తుండటం వల్ల, అక్కడ బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. అలాంటి కీలక ప్రాంతంలో ధురంధర్ విడుదల కాకపోవడం నిర్మాతలకు పెద్ద లోటుగా మారింది.
వాస్తవానికి బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఆరు గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాను నిషేధించారు. కథలోని ఆపరేషన్ ల్యారి నేపథ్యం, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉన్న సందేశాలు కారణంగా సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రకారం, డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాకు వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్‌ను బట్టి చూస్తే, గల్ఫ్ దేశాల్లో విడుదలై ఉంటే దాదాపు 100 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉండేదని తెలిపారు.
సాధారణంగా భారతీయ యాక్షన్, దేశభక్తి నేపథ్య చిత్రాలు గల్ఫ్ దేశాల్లో మంచి విజయాన్ని అందుకుంటాయి. ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు గతంలో అక్కడ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అదే కోవలో ధురంధర్ కూడా నిలిచింది.
అన్ని అడ్డంకుల మధ్య కూడా ధురంధర్ 2025లో భారత్ నుంచి వచ్చిన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా జవాన్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్లను దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.