సనాతన ధర్మంలో అధికమాసాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. శుభకార్యాలు చేయరాదని మాత్రమే గుర్తుంచుకుని, ఇది అశుభమని భావించడం పెద్ద అపోహ. నిజానికి అధికమాసం అత్యంత పవిత్రమైన కాలంగా ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు ఒక రాశిలో ప్రవేశించకుండానే చంద్ర మాసం పూర్తయ్యే సందర్భంలో ఏర్పడే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలుస్తారు. 2026 సంవత్సరంలో మే 17 నుంచి జూన్ 15 వరకు జ్యేష్ఠ మాసంలో అధికమాసం వస్తుంది.
ఈ మాసాన్ని శ్రీమహావిష్ణువు తనకు అంకితం చేసుకున్నాడని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటి భౌతిక శుభకార్యాలు చేయరు. అయితే భక్తి సాధనకు ఇది స్వర్ణావకాశం. నదీ స్నానం, ఉపవాసం, జపం, ధ్యానం, వ్రతాలు, దానధర్మాలు చేయడం వల్ల సాధారణ మాసాల కంటే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. విష్ణు సహస్రనామ పఠనం, భాగవత పారాయణం, తులసి పూజ, ఏకాదశి వ్రతం ప్రత్యేక ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఈ కాలంలో చేసిన భక్తి ఆరాధనలు మనసుకు శాంతిని, జీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.