వైష్ణువుల 108 దివ్య దేశాల్లో పూరీ జగన్నాథ్ కూడా ఒకటి. పూరీని మోక్షపురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో దర్శనమిస్తాడు. జగన్నాథుడిని నిత్యం వేలాది మందిభక్తులు దర్శించుకుంటారు. కానీ, జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమి నుంచి 15 రోజులపాటు ఆయన్ను దర్శించుకోవడం ఎవరి వల్లకాదు. జ్యేష్టపౌర్ణమి రోజున స్వామివారు 108 కలశాలతో స్నానం చేసిన తరువాత అనారోగ్యం బారిన పడతారు. ఈ అనారోగ్యం నుంచి స్వామిని రక్షించేందుకు ఆలయ వైద్యులు ఆయనకు వివిధ రకాలైన లేపనాలతో ప్రత్యేక చికిత్స చేస్తారు. 15 రోజుల అనంతరం నూతనోత్సాహంతో పురప్రజలకు దర్శనం ఇస్తారు. ఈ క్రమంలో జరిగే వేడుకే రథోత్సవం. అయితే, సాక్షాత్తు భగవంతుడైన జగన్నాథుడు అనారోగ్యం బారిన పడటం ఏంటి…ఆయనకు సామాన్యులు వైద్యం అందించడం ఏమిటి? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆలయంలో పహండీ యాత్రను నిర్వహిస్తారు. పహండీ యాత్ర అంటే స్వామివారు ఆలయం నుంచి బయటకు రావడం. ఇలా ఆలయం నుంచి స్వామిని బయటకు తీసుకొచ్చి ప్రత్యేకమైన వేదికపై కూర్చోబెడతారు. స్వామివార్లకు గుడ్డను చుట్టి 108 కలశాలతో నీటిని తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. ఇలా వివిధ తీర్థాల నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో స్వామిని అభిషేకించడంతో ఆయన శరీరం వేడెక్కుతుంది. జ్వరం వచ్చేస్తుంది.
ఈ క్రమంలోనే 15 రోజులపాటు స్వామివారికి విశ్రాంతి ఇస్తున్నట్టుగా ఆలయ అధికారులు ప్రకటిస్తారు. ఈ 15 రోజులు జరిగే తంతును అనసర లీల అని పిలుస్తారు. అంటే ఈ 15 రోజులు ఏకాంత సేవలే. ప్రత్యక్ష సేవలు ఉండవు. గుడిని మూసేస్తారు. బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఈ 15 రోజులు స్వామివారిని దర్శించలేరు. దయిద్గత్ అనే స్వామివారి ఏకాంత సేవలకులు మాత్రమే ఆయన సేవలు చేస్తారు. స్వామివారి కోసం 24 గంటలు పనిచేసే వంటశాలను మూసేస్తారు. ఈ 15 రోజుల కాలంలో స్వామివారికి వివిధ రకాలైన వనమూలికలు, కాషాయాలు మాత్రమే ఇస్తారు. అంతేకాదు, ఈ 15 రోజులపాటు ఒక ప్రత్యేక వైద్యుడు వెళ్లి స్వామివారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తుంటారు. ఈ వివరాలన్నింటిని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలోని పౌర్ణమి నుంచి 15 రోజుల పాటు స్వామివారి ఎందుకు అనారోగ్యం బారిన పడతారు అనడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఒకానొకప్పుడు మాధవదాస్ అనే భక్తులు స్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు. ఆయన నిరంతరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే స్వామివారి సేవను చేయడం మానలేదు. ఒకసారి అనూహ్యంగా ఆనారోగ్యం బారిన పడినప్పటికీ తాను బాగున్నానని స్వామివారి సేవ చేస్తానని చెబుతాడు. చెప్పిన వినకుండా స్వామి సేవకు తరలివచ్చి స్పహతప్పి పడిపోతాడు. ఆ తరువాత ఆయనకు ఓ వ్యక్తి దగ్గరుండి సపర్యలు చేస్తాడు. కోలుకున్నాక తనకు సేవలు చేసిన వ్యక్తి సాక్షాత్తు ఆ జగన్నాథుడే అని తెలుసుకొని నేరుగా వెళ్లి స్వామిని ప్రశ్నిస్తాడు. భగవంతుడివి అయినపుడు తనను అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలిగాని, అనారోగ్యంతో ఉన్నప్పుడు సేవ చేయడం ఏంటని ప్రశ్నిస్తారు. దీనికి ఆ స్వామి చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోతాడు. విధిని మార్చే శక్తి తనకు లేదని, తన భక్తుడు బాధపడితే ఆ బాధను తగ్గించడమే తన కర్తవ్యమని అంటాడు. ఇంకా 15 రోజులపాటు అనారోగ్యం బారిన పడాల్సి ఉందని, కానీ, నిశ్వార్ధమైన సేవకు మెచ్చి ఆ 15 రోజుల అనారోగ్యాన్ని తాను స్వీకరించినట్టుగా చెబుతాడు జగన్నాథుడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 15 రోజులపాటు స్వామివారు అనారోగ్యం బారిన పడటం సహజంగా మారింది.
ఈ కథతో పాటు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూరీని పరిపాలించే రాజుకు స్వప్నంలో స్వామి కనిపించి ఆలయం ముందున్న మర్రిచెట్టు వద్ద తనకోసం ఓ బావిని తవ్వించాలని, ఆ బావినుంచి నీళ్లను తోడి తనకు స్నానం చేయించాలని కోరాడట. స్వామి కోరిక మేరకు ఆలయం ఎదురుగా మర్రిచెట్టు వద్ద బావిని తవ్వించి జ్యేష్టమాసంలో పౌర్ణమి రోజున ఆ బావినుంచి నీళ్లను తోడి స్వామివారికి పోశారని అంటారు. ఆ సమయంలో స్వామివారు అనారోగ్యం బారిన పడ్డారని, తాను అనారోగ్యంతో ఉన్నానని, 15 రోజులపాటు తన దర్శనం ఎవరికీ ఉండకూడదని పూరీ రాజు కలలో చెప్పినట్టుగా కథ ప్రచారంలో ఉంది. ఆ ఆచారాలను అనుసరించి నేటికీ జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమి రోజున 108 కలశాలతో నీళ్లను స్వామికి పోస్తారు. ఆరోజు సాయంత్రానికి స్వామివారు అనారోగ్యం బారిన పడతారు. స్వామికి జ్వరం వస్తుంది. 15 రోజులపాటు ఆయనకు వైద్యులు చికిత్స చేస్తారు. ఏకాంత సేవలు మాత్రమే జరుగుతాయి. వంటగదిని మూసేస్తారు. 15 రోజుల తరువాత పూరీ జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమౌతాడు. 15 రోజులపాటు దర్శించుకోకుండా ఉండిపోయిన భక్తులు రథయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్ని ఆయన్ను దర్శించుకొని సంతోషిస్తారు. స్వామివారు అనారోగ్యం బారిన పడిన 15 రోజులు ప్రపంచంలో ప్రకృతిలో పలు మార్పులు సంభవిస్తాయని, ఎక్కువమంది ఈ 15 రోజుల కాలంలో వివిధ రకాలైన రుగ్మతలకు గురౌతారని, 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించేందుకే స్వామివారు అనారోగ్యం బారిన పడతారట.