సంక్రాంతి సినిమా సందడి మొదలవ్వబోతున్న వేళ… టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోస్ అనుమతులపైనే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలైన ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కొన్ని రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రెండు సినిమాలపై భారీ పెట్టుబడులు ఉండటంతో, నిర్మాతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతులు పొందాలని ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తులు సమర్పించారు.

ఇదిలా ఉండగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు, ఫెస్టివల్ స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేశారు.

గత ఏడాది ప్రజాప్రయోజనాల దృష్ట్యా సినిమా టికెట్ ధరలు పెంచకూడదని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అఖండ 2 సినిమాకు సంబంధించి టికెట్ హైక్స్, స్పెషల్ షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను కోర్టు సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై అప్పట్లో ప్రభుత్వాన్ని కూడా మందలించింది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.
అందుకే, ఈ రెండు సినిమాల నిర్మాతలు గత ఆదేశాలను రద్దు చేయాలని, టికెట్ ధరల పెంపు, ఎర్లీ షోలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. నిర్మాతల తరఫున న్యాయవాదులు అత్యవసర విచారణకు హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
రేపటి తీర్పు ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఓపెనింగ్‌పై కీలక ప్రభావం చూపనుంది. కోర్టు అనుకూలంగా స్పందిస్తే… రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాతల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు నటించిన ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సీజన్లో ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.