సంక్రాంతి పండుగవేళ టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం… అందుబాటులో 6431బస్సులు

TGSRTC Gears Up for Sankranti 6,431 Special Buses to Serve Festival Rush

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీ దృష్ట్యా ఈసారి మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ముఖ్యంగా జనవరి 9, 10, 12, 13 తేదీల్లో వెళ్లే ప్రయాణికుల రద్దీ, 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేసి అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతోంది.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ పండల్స్, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 16 ప్రకారం ఈ ప్రత్యేక బస్సులకు మాత్రమే 1.5 రెట్లు టికెట్ ఛార్జీల సవరణ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే కొనసాగుతాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని, పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *