•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్
•చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్, మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు.