కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమా అంటూ భారీ అంచనాలతో సిద్ధమైన ‘జన నాయకన్’… ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ వివాదం కారణంగా ఈ సినిమా విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. మద్రాస్ హైకోర్టు ఈ అంశంపై తీర్పును ఈ రోజు ఉదయం వరకు రిజర్వ్ చేయడంతో, నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడమే ఈ మొత్తం గందరగోళానికి కారణం.
రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత, మద్రాస్ హైకోర్టు చివరికి సినిమా తరఫున కీలక తీర్పు వెలువరించింది. ‘జన నాయకన్’ సినిమాకు వెంటనే U/A సర్టిఫికెట్ జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. అలాగే, జనవరి 6న CBFC చైర్‌పర్సన్ విడుదల చేసిన లేఖకు చట్టపరమైన హక్కు లేదని పేర్కొంది. ఎగ్జామినింగ్ కమిటీ సూచించిన మార్పులు పూర్తయ్యాక, సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా జారీ కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో, సినిమాను రివ్యూ కమిటీకి పంపుతూ CBFC చైర్‌పర్సన్ ఇచ్చిన లేఖను హైకోర్టు రద్దు చేసింది. అదే లేఖ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యానికి ప్రధాన కారణంగా మారడంతో పాటు, సినిమా విడుదల వాయిదాకు దారి తీసిందని కోర్టు అభిప్రాయపడింది.
తీర్పు వెలువడిన వెంటనే, అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అత్యవసరంగా హాజరై అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. అయితే, అప్పీల్‌కు అంత అత్యవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. అప్పీల్ అధికారికంగా దాఖలు చేసిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు. చీఫ్ జస్టిస్ తుది నిర్ణయం వెలువడిన తర్వాతే ‘జన నాయకన్’ విడుదలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, హైకోర్టు తాజా తీర్పు దళపతి విజయ్ అభిమానుల్లో భారీ ఊరటను కలిగించింది. దళపతి చివరి సినిమాగా భావిస్తున్న ఈ చిత్రం… ఇప్పుడు కోర్టు తీర్పులతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.