హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దళిత విద్యార్థిని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాలేజీలో జరిగిన అవమానకర ఘటనలే ఆమె మానసికంగా కుంగిపోవడానికి కారణమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మల్కాజిగిరికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఆలస్యంగా కాలేజీకి చేరుకుంది. దీనిపై లెక్చరర్లు క్లాస్‌కు అనుమతించలేదు. ఈ సమయంలో విద్యార్థిని తనకు పీరియడ్స్ వచ్చాయని చెప్పినప్పటికీ, లెక్చరర్లు దాన్ని నమ్మకుండా “నాటకాలు ఆడుతున్నావా… ఏది చూపించు” అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మాటలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు.
కాలేజీలో జరిగిన అవమానం తట్టుకోలేక విద్యార్థిని తీవ్రంగా కుంగిపోయి ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిందని, మెదడులో బ్లడ్ క్లాట్ ఏర్పడి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్త కుటుంబాన్ని మాత్రమే కాకుండా విద్యార్థులందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాలేజీ ముందు ఉద్రిక్తత నెలకొంది. తోటి విద్యార్థులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధ్యులైన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి అమానవీయ ప్రవర్తనకు తావు లేదని, విద్యార్థుల గౌరవం, భద్రతను కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధానాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ విషాదం స్పష్టంగా చూపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఘటనపై ప్రభుత్వం, విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నదానిపై అందరి దృష్టి నెలకొంది.