జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి… ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి

Deputy CM Pawan Kalyan Launches Pithapuram Sankranti Mahotsavam, Warns Against Gambling and Caste Politics
  • భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందాం
    •సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలి
  • పిఠాపురంలో పోటీ చేయడం భగవంతుడి సంకల్పం
    •ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించను
    •లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
    •పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు
    •అభివృద్ధికి కేరాఫ్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా
    •బూతులు తిట్టడం, కేసులు పెట్టడం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు
    •పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
    •రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో… అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు.

అప్యాయత, అనురాగాలకు నిలువటద్దాలు. వాటి మూలలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు. మన మూలలను మనం మరిచిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి నుంచి… కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవన సౌందర్యానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ భగవంతుడి సంకల్పం.

గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు:
గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం.

బాబాయ్ ను లేపేస్తే అది వార్త కాదు:
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్‌ చేస్తున్నారు. పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా, పక్షి ఈక రాలినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు.. పిఠాపురంలో స్కూల్‌ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుంది. ఎంతో విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులే మాటకు మాట అనుకుంటున్న రోజులివి. అలాంటిది చిన్న పిల్లలు ఒక మాట అనుకోరా? దానికి కులాలను మధ్యలోకి తీసుకురావాలా? గత ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటే… బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం.

ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు. ముఖ్యమంత్రి గారు అయినా, నేను అయినా తప్పు చేస్తే శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం. నన్ను ఒక మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించను. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చాలా గట్టిగా తీసుకుంటాను.

ఎటువంటి అరమరికలు లేవు:
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకుగానూ ప్రతి నెల రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా హడావుడి లేకుండా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. దీని కోసం గత ప్రభుత్వం మాదిరి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మగ్గాలపై పని చేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద 62.27 లక్షల మందికి లబ్ధిని చేకూర్చాం. గత ప్రభుత్వం నాసికరం మద్యం అమ్మకాలతో రూ. 23 వేల కోట్లు దోచుకుంటే .. మా ప్రభుత్వం ఆ దోపిడీని అరికట్టి రూ. 10 వేల కోట్లు తల్లికి వందనం పథకానికి ఖర్చు చేశాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 4 కోట్ల భోజనాలు అందించాము. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున 2.90 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 436 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే … కూటమి పాలనలో కేంద్రాన్ని మళ్ళీ ఒప్పించి రూ. 24 వేల కోట్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు నా మధ్య ఎలాంటి అరమరికలు, విభేదాలు లేవు. పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు.

•అభివృద్ధికి కేరాఫ్ గా పిఠాపురాన్ని మారుస్తాం:
ఈ సంక్రాంతి సంబరాలతో పాటు మన నియోజకవర్గానికి అభివృద్ధి పండుగను కూడా తీసుకువచ్చింది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా రూ. 211 కోట్ల 72 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలంలో నాలుగు ఎకరాల స్థలంలో రూ. 9.60 కోట్ల అంచనా వ్యయంతో ఎఫ్.ఎఫ్.సి.కి శంకుస్థాపన చేశాం. ఇది ప్లగ్ అండ్ ప్లే విధానంలో భాగంగా సుమారు 26 మంది మైక్రో, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు జీవనోపాధి కలిగిస్తుంది. దీని నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి సుమారు 650 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇది నిర్మాణం పూర్తి అవ్వగానే ఇందులో 50 శాతం యూనిట్లు ఎస్సీ, మత్స్యకారులకు కేటాయిస్తాం. ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్ , నాలుగు డ్రై ఫిషింగ్ ప్లాట్ ఫామ్‌ను నిర్మిస్తున్నాం.

పల్లెల్లోని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి, ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో రూ.31.21 కోట్ల అంచనా వ్యయంతో 178 మినీ గోకులాలు, 12 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 2 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నాం. రహదారులు, భవనాల శాఖ ద్వారా చాలా సంవత్సరాలుగా దెబ్బ తిన్న ప్రధాన రహదారులు మరమ్మతులు చేసేందుకు రూ.26. 95 కోట్ల కేటాయించాం. గొల్లప్రోలు నగర పంచాయతీలోని మురుగు సమస్య తీర్చేందుకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో సీసీ డ్రైన్లను నిర్మిస్తున్నాం. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలకు మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్లు మంజూరు చేశాం. రూ. 14 కోట్ల అంచనా వ్యయంతో కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా పిఠాపురంలోని దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రాబోయే వేసవి కాలంలో పిఠాపురం పట్టణంలోని ప్రజలకు విద్యుత్ అసౌకర్యాలు ఉండకూడదు అనే ఉద్దేశం తో రూ. 2.95 కోట్లు వ్యయంతో 33/11 కె.వి. ఎలక్ట్రికల్ సబ్ స్టేషను నిర్మించాం. పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులను రూ.కోటి ముప్పై ఐదు లక్షల వ్యయంతో పూర్తి చేశాం. వరదల సమయంలో నేను గొల్లప్రోలు నగర పంచాయతీలోని హౌసింగ్ కాలనీకి పడవలో వెళ్ళినప్పుడు వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చాను. వరదల సమయంలో కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా రూ. 3.05 కోట్లతో బ్రిడ్జి నిర్మించాం.

అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలోని సూరంపేట కాలనీ వాసులకు కూడా వరదల సమయంలో వారి రాకపోకలకు తీవ్ర అవస్థలు ఏర్పడుతున్నాయనే అంశం నా దృష్టికి రావడంతో ఇరవై ఏడు లక్షలు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేశాం. పీఎం శ్రీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లప్రోలు లో రూ.1.15 కోట్ల వ్యయంతో సైన్స్ లాబ్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మించాం. పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. మొదటి ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడు మరో రూ. 211 కోట్లతో చేపట్టబోతున్నాం.

•దేశంలోనే అత్యుత్తమ యుద్ధ విద్యల అకాడమీ పిఠాపురంలో ఏర్పాటు చేస్తాం:
పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం. వచ్చే మూడున్నరేళ్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతాం. పిఠాపురంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఉండకూడదు. ఏ రోడ్డుపై కూడా గుంతలు కనబడకూడదు. ముంపు అన్న మాట వినబడకూడదు. అదే నా లక్ష్యం. ఇండియాలోనే అత్యున్నతమైన యుద్ధకళల అకాడమీని పిఠాపురంలో ఏర్పాటు చేస్తాం. యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.

మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్మినిస్టేషన్ హెడ్ క్వార్టర్ అయితే… ఐడిలాజికల్ హెడ్ క్వార్టర్ మాత్రం పిఠాపురమే. ప్రతి ఏడాది ఈ నియోజకవర్గంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నామ”న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *