అత్యరాల… ఈ పేరు వినగానే భక్తుల మనసుల్లో ఒక అపూర్వమైన పురాణ గాథ కదలాడుతుంది. ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి వెనుక ఉన్న కథ, కేవలం ఒక గ్రామ చరిత్ర మాత్రమే కాదు… పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ధర్మం అనే మూడు స్తంభాలపై నిలిచిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.
పురాణాల ప్రకారం పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని వధించిన అనంతరం తీవ్ర పశ్చాత్తాపంతో దేశమంతా తిరిగాడని చెబుతారు. తన చేతిలో ఉన్న గొడ్డలిపై అంటుకున్న రక్తపు మరకలు తొలగిపోవాలనే ఆరాటంతో అనేక నదుల్లో ఆ గొడ్డలిని కడిగినా ఫలితం దక్కలేదట. చివరకు కడప జిల్లా రాజంపేట సమీపంలోని కామాక్షి త్రీతేశ్వర ఆలయం వద్ద ప్రవహించే పవిత్రమైన బహుదానదికి చేరుకున్న పరశురాముడు అక్కడ తన గొడ్డలిని కడగగానే రక్తపు మరకలు పూర్తిగా తొలగిపోయాయని స్థల పురాణం చెబుతోంది. ఆ క్షణమే తన పాపం రాలిపోయిందని భావించిన పరశురాముడు ఈ ప్రాంతాన్ని “హత్య రాలె”గా పిలిచాడట. కాలక్రమంలో అదే పేరు మారి “అత్యరాల”గా రూపాంతరం చెందినట్టు స్థానికుల విశ్వాసం.
ఈ గాథలో మరో ముఖ్యమైన పాత్ర ఏకా తాతయ్య. పరశురాముడికి ఆ సంకట సమయంలో ఆశ్రయం ఇచ్చి, మార్గదర్శనం చేసిన మహానుభావుడిగా ఏకా తాతయ్యను ప్రజలు గౌరవిస్తారు. “నీవెక్కడ ఉంటావో… నీ ఎదురుగానే నేనూ ఉంటాను” అని పరశురాముడితో చెప్పిన ఏకా తాతయ్య కోరిక మేరకు, నేడు బహుదానది ఒడ్డున ఉన్న పరశురామ దేవాలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా ఏకా తాతయ్య విగ్రహం ప్రతిష్టించబడి ఉంది.
అత్యరాల ప్రాంతంలో కొలువైన ఏకా తాతయ్య, తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిన జానపద దేవుడు. పురాణ గ్రంథాల్లో ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా, ప్రజల విశ్వాసమే ఆయనకు పునాది. కడప, రాయచోటి, అత్యరాల పరిసర గ్రామాల్లో ఆయనను గ్రామ రక్షకుడిగా, న్యాయ దేవుడిగా ఆరాధిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఏకా తాతయ్య పరశురాముడికి మాతామహుడిగా, అంటే రేణుకాదేవి తండ్రిగా భావిస్తారు.
ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఏకా తాతయ్య సాక్షిగా ప్రమాణం చేస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ప్రజల్లో బలంగా ఉంది. ధర్మం, న్యాయం, రక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ జానపద దేవుడు… నేటికీ అత్యరాల ప్రజల విశ్వాసానికి కేంద్రబిందువుగా వెలుగొందుతున్నాడు.