అమెరికా నుంచి వస్తున్న బెదిరింపులకు గ్రీన్‌ల్యాండ్ తలవంచేది లేదని అక్కడి రాజకీయ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రీన్‌ల్యాండ్‌ను ఏ విధంగానైనా తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. గతంలో వెనుజులాపై వైమానిక దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మాదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తరలించిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ, ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌పై కూడా అదే తరహా చర్యలు చేపడతామని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో అక్కడ తీవ్ర కలకలం మొదలైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రీన్‌ల్యాండ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు తొలిసారి ఏకతాటిపైకి వచ్చాయి. “అమెరికా ఒత్తిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం” అనే స్పష్టమైన సందేశంతో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తమ భూభాగం, స్వతంత్రతపై ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే అన్ని మార్గాల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించాయి. తాము అమెరికా పౌరులుగా మారాలన్న ఆలోచననే తిరస్కరిస్తున్నామని, తమ పాలన సజావుగా సాగుతోందని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి.
చరిత్రపరంగా గ్రీన్‌ల్యాండ్, ఫారో దీవులు ఒకప్పుడు డెన్మార్క్ పాలనలో ఉండేవి. ప్రస్తుతం ఇవి స్వయం పాలన కలిగి ఉన్నప్పటికీ, డెన్మార్క్‌తో అనుబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ ప్రధాని కూడా అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక నాటో దేశంపై మరో నాటో దేశం సైనిక చర్యలకు పాల్పడితే, అది నాటో భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. గ్రీన్‌ల్యాండ్ గుర్తింపును కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గ్రీన్‌ల్యాండ్‌పై రష్యా, చైనాల ఆసక్తి పెరుగుతోందని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నౌకలు గ్రీన్‌ల్యాండ్ తీరానికి చేరుకున్నాయని, అమెరికా ముందుగా చర్యలు తీసుకోకపోతే ఆ దేశాలు అక్కడ పట్టు సాధిస్తాయని ఆయన వాదన. మరోవైపు మెక్సికోపై అమెరికా దృష్టి పెట్టడం, రష్యా జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపుకు సంకేతంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.