తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగానే భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిటకిటలాడుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు ముందే సమ్మక్క–సారక్కల దర్శనానికి రోజూ లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల ప్రభావంతో ఆదివారం (జనవరి 11) ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా భక్తులు మేడారంకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీతో జంపన్నవాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి. పుణ్యస్నానాల కోసం వాగులోకి వేలాది మంది దిగడంతో అక్కడ ఒక్కసారిగా హడావుడి నెలకొంది. ఈ గందరగోళంలో ఓ చిన్నారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. తల్లిదండ్రులు కనిపించక ఆ బాలిక ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతుండటాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క వెంటనే స్పందించారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుదీర్ రామనాథ్ కేకన్‌తో కలిసి జంపన్నవాగు వద్దకు వెళ్లిన సీతక్కకు ఆ బాలిక కనిపించింది.
తల్లి దండ్రుల జాడ లేక కన్నీళ్లతో ఉన్న చిన్నారిని దగ్గరకు తీసుకుని, ఎత్తుకుని ఓదార్చిన సీతక్క ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం తన అంగరక్షకులు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో కలిసి బాలిక తల్లిదండ్రుల కోసం వెంటనే వెతకమని ఆదేశించారు. కొద్ది సేపటి శోధన అనంతరం బాలిక తల్లిదండ్రులను గుర్తించి, వారి చేతికి ఆ చిన్నారిని సురక్షితంగా అప్పగించారు.
ఈ ఘటనను చూసిన భక్తులు సీతక్క మానవత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. అధికార బాధ్యతలతో పాటు మానవీయ విలువలకు పెద్దపీట వేస్తున్న సీతక్క తీరు అందరి మనసులను కదిలించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పిల్లలను ఎప్పుడూ జాగ్రత్తగా తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని పరిస్థితిలో పిల్లలు తప్పిపోయితే భయపడకుండా సమ్మక్క–సారక్క సన్నిధిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని సీతక్క భరోసా ఇచ్చారు.