మన శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం చాలా సాధారణం. కొందరికి అవి అందానికి గుర్తుల్లా అనిపిస్తే, మరికొందరికి మాత్రం ఆందోళనకు కారణమవుతాయి. ముఖ్యంగా అకస్మాత్తుగా కొత్త మచ్చలు రావడం, లేదా ఉన్న పుట్టుమచ్చలు పరిమాణంలో మారడం, రంగు మారడం లాంటి విషయాలు గమనించినప్పుడు “ఏదైనా ప్రమాదమా?” అనే సందేహం కలగడం సహజం. అయితే ప్రతి పుట్టుమచ్చ భయపడాల్సిన విషయమేమీ కాదని చర్మ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పుట్టుమచ్చలు ఎలా ఏర్పడతాయి అంటే… మన చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ మెలనిన్ను ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ అనే కణాలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడినప్పుడు అక్కడ చిన్న మచ్చలా కనిపిస్తుంది. ఇవి నలుపు, గోధుమ, లేత గులాబీ, కొన్నిసార్లు నీలం రంగులో కూడా ఉండొచ్చు. శరీరంలోని ఏ భాగంలోనైనా ఇవి కనిపించవచ్చు.
సాధారణంగా ఒక వ్యక్తి శరీరంపై 10 నుంచి 40 వరకు పుట్టుమచ్చలు ఉండటం సహజమే. అయితే కొన్ని కారణాల వల్ల ఇవి సంఖ్యలో పెరగవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే, వంశపారంపర్యంగా అవి రావచ్చు. కౌమార దశ, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా కొత్త మచ్చలు కనిపించడం కూడా సాధారణమే. అలాగే ఎక్కువగా ఎండ తగిలే భాగాలపై సూర్యకిరణాల ప్రభావంతో మచ్చలు స్పష్టంగా మారుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పుల వల్ల కూడా కొన్ని మచ్చలు బయటపడతాయి.
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. పుట్టుమచ్చ హఠాత్తుగా పెరగడం, ఒకే మచ్చలో రంగులు మారడం, అంచులు అసమానంగా ఉండడం, దురద లేదా నొప్పి రావడం, దెబ్బ తగలకుండానే రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి చర్మ సంబంధిత సమస్యలు లేదా అరుదుగా చర్మ క్యాన్సర్కు సూచనలుగా ఉండవచ్చు. అందుకే శరీరం ఇస్తున్న ఈ సంకేతాలను గమనిస్తూ, సందేహం వచ్చిన వెంటనే చర్మ నిపుణుడిని సంప్రదించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.