మార్షల్ ఆర్ట్స్ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అరుదైన, విశేషమైన గౌరవాన్ని సాధించారు. ప్రాచీన జపాన్ ఖడ్గయుద్ధ కళ అయిన కెంజుట్సు (Kenjutsu) లో అధికారికంగా ప్రవేశం పొందుతూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది నటుడు, ప్రజానాయకుడు. సినిమాల్లో విభిన్నమైన పాత్రలు, ప్రజాసేవలో స్పష్టమైన దృష్టితో ముందుకెళ్తున్న నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన జీవితం సినిమాలు, రాజకీయాలతో మాత్రమే పరిమితం కాలేదు. మార్షల్ ఆర్ట్స్ ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.
ఈ పెద్ద న్యూస్ ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ పేజీ లో official గా ప్రకటించి, ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు… మీరు చూసేయండి:
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం సినిమా రంగంలోకి రాకముందే ప్రారంభమైంది. ముఖ్యంగా చెన్నైలో ఉన్న రోజుల్లో ఆయన కరాటే, ఇతర యుద్ధ కళల్లో గంభీరమైన శిక్షణ పొందారు. శరీర సాధనతో మాత్రమే కాకుండా, జపాన్ సామురాయి సంప్రదాయాలు, మార్షల్ ఆర్ట్స్ తత్వశాస్త్రం పట్ల కూడా లోతైన అవగాహన పెంచుకున్నారు.
సంవత్సరాలుగా కొనసాగిన ఈ అంకితభావానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పవన్ కళ్యాణ్‌ను అధికారికంగా కెంజుట్సు లోకి ఆహ్వానించడం ఒక అరుదైన గౌరవం. అంతేకాదు, జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ సోగో బుడో కన్రి కై (Sogo Budo Kanri Kai) నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (Fifth Dan) బిరుదు కూడా లభించింది.
ఇది మాత్రమే కాకుండా, జపాన్ వెలుపల చాలా అరుదుగా ఇచ్చే గౌరవంగా, సోకే మురమత్సు సెన్సై ఆధ్వర్యంలోని టకేదా షింగెన్ క్లాన్ లోకి ప్రవేశించిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. అదేవిధంగా, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనను “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే బిరుదుతో సత్కరించింది.
భారతదేశంలోని ప్రముఖ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నిపుణులలో ఒకరైన ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో కెండో (Kendo) లో సాధన చేస్తూ, సాంకేతిక నైపుణ్యంతో పాటు లోతైన అవగాహనను సంపాదించారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూపించిన యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పోరాట శైలిలో సహజత్వం, క్రమశిక్షణ, శక్తి అన్నీ కలిసివుంటాయి.
ఈ ఘనతతో పవన్ కళ్యాణ్, ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌లో గౌరవం పొందిన భారతీయులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇది ఆయన అభిమానులకు మాత్రమే కాదు, యువతకు కూడా ఒక గొప్ప ప్రేరణ.