ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క రోజు గడపలేని పరిస్థితి మన చుట్టూ కనిపిస్తోంది. కానీ దేశ జాతీయ భద్రతా వ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తి మాత్రం మొబైల్, ఇంటర్నెట్ లేకుండానే తన రోజువారీ పనులు నిర్వహిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.
ఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ప్రారంభ సమావేశంలో పాల్గొన్న అజిత్ దోవల్, తన జీవనశైలిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సాధారణంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ను ఉపయోగించనని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కుటుంబ సభ్యులు లేదా విదేశీ సన్నిహితులతో మాట్లాడేందుకు ఫోన్ వినియోగిస్తానని తెలిపారు. భద్రతా పరంగా డిజిటల్ కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయని, ప్రజలకు తెలియని ప్రత్యేక పద్ధతులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అజిత్ దోవల్ జీవనశైలి పూర్తిగా క్రమశిక్షణతో కూడినదిగా ఉంటుంది. సాధారణ ఆహారం, మితమైన అలవాట్లు, అవసరం లేని ఆడంబరాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. గోప్యత, మౌనం, క్రమశిక్షణే తన బలమని ఆయన చర్యలే చెబుతున్నాయి. భద్రతే జీవితం అన్నట్లుగా, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండటం ఆయనకు అలవాటు.
1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన అజిత్ దోవల్, 1968లో ఐపీఎస్‌లో చేరి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ సేవలు అందించారు. కీర్తి చక్ర అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడైన పోలీసు అధికారిగా చరిత్ర సృష్టించారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, హైజాకింగ్ సంక్షోభాలు, అంతర్జాతీయ గూఢచర్య మిషన్లలో కీలక పాత్ర పోషించారు.
సాధారణ జీవితం, అసాధారణ బాధ్యతలు… ఇదే అజిత్ దోవల్ లైఫ్‌స్టైల్. ఆధునిక సాంకేతికతపై ఆధారపడకుండానే దేశ భద్రతను కాపాడుతున్న ఆయన జీవితం యువతకు నిజంగా ఒక గొప్ప ప్రేరణ.