శ్రీరాముని పరమ భక్తుడిగా, అపార బలానికి ప్రతీకగా హనుమంతుడు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ధైర్యం, నమ్మకం, సేవాభావం కలిసిన దైవ స్వరూపమే ఆంజనేయుడు. అందుకే చిన్నా–పెద్దా తేడా లేకుండా ప్రతి భక్తుడు హనుమంతుని స్మరించుకొని రోజును ప్రారంభిస్తాడు. సాధారణంగా ఆలయాల్లో హనుమంతుడు ఒంటరిగా దర్శనమివ్వడం మనం చూస్తుంటాం. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగా భావించడమే దీనికి కారణం.
అయితే పురాణ గాథల్లో ఒక విశేషమైన కథ ఉంది. హనుమంతుడు సూర్యభగవానిని గురువుగా భావించి, ఆకాశంలో సంచరిస్తూనే వేదాలు, వ్యాకరణాలు నేర్చుకున్నాడని చెబుతారు. తొమ్మిదవ వ్యాకరణాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి వివాహబంధం అవసరమవడంతో, త్రిమూర్తుల సంకల్పంతో సూర్యుడు తన తేజస్సు నుంచి సువర్చల అనే దివ్య స్వరూపాన్ని సృష్టించి హనుమంతుడికి వివాహం జరిపిస్తాడు. భౌతిక రూపం లేని ఈ వివాహం వల్ల హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి భంగం కలగలేదు.
ఈ కారణంగానే దేశంలో కొన్ని అరుదైన ఆలయాల్లో మాత్రమే హనుమంతుడు సువర్చల సహితుడిగా దర్శనమిస్తాడు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం అలాంటి ప్రత్యేక ఆలయం. ఇక్కడ జరిగే ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులకు అపూర్వ అనుభూతిని ఇస్తుంది. దాంపత్య సమస్యలు తొలగిపోతాయని, కుటుంబ జీవితం సంతోషంగా మారుతుందని భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి విశ్వాసంతో ప్రార్థిస్తుంటారు.