మరో సారి పోస్టుపోన్ అవ్వనున్న కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమా???

Karthi’s Vaa Vaathiyaar Faces Fresh Legal Trouble Ahead of Pongal Release

కోలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొంగల్‌ వీక్ ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దళపతి విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ న్యాయపరమైన చిక్కుల కారణంగా వాయిదా పడగా, శివకార్తికేయన్ సినిమా ‘పరాశక్తి’ మిక్స్‌డ్ టాక్‌తో ప్రారంభమై ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. దీంతో పొంగల్‌ సీజన్ మొత్తం కోలీవుడ్‌కు నిరాశనే మిగిల్చినట్లైంది.

ఇలాంటి పరిస్థితుల్లో, తమిళ నటుడు కార్తీ నటించిన ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పోలీస్ డ్రామా ‘వా వాత్తియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) జనవరి 14న విడుదల కానుందని ప్రకటించడంతో, కోలీవుడ్‌లో మళ్లీ కాస్త ఆశలు చిగురించాయి. కానీ అన్నీ అడ్డంకులు తొలగిపోయాయని భావించిన సమయంలోనే… ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరోసారి లీగల్ సమస్యలు తెరపైకి వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, కరూర్‌కు చెందిన ధనేష్ అసోసియేట్స్ అనే సంస్థ ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయకుండా ఆపాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి సోమవారం విచారించనున్నారు. కోర్టు తీర్పు ఆధారంగానే సినిమా విడుదల భవితవ్యం నిర్ణయించబడనుంది.

ఈ సినిమా మరోసారి వాయిదా పడితే మాత్రం అది భారీ దెబ్బగా మారనుంది. ఎందుకంటే, ‘జన నాయగన్’ వాయిదా పడటం, ‘పరాశక్తి’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల… ఈ పొంగల్‌ సీజన్‌లో థియేటర్లు దాదాపు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి బంగారు అవకాశాన్ని ‘వా వాత్తియార్’ కోల్పోతే, నిర్మాతలకు పెద్ద నష్టమే అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వాస్తవానికి ‘వా వాత్తియార్’ సినిమా గత ఏడాది డిసెంబర్ 12కే విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పట్లో హైకోర్టు అధికార అసైనీ ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేయడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ పిటిషన్‌లో, స్టూడియో గ్రీన్ అధినేత కె.ఈ. జ్ఞానవేల్ రాజా రూ. 21.78 కోట్ల మేర బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది.

ఈ వివాదం వ్యాపారవేత్త అర్జున్‌లాల్ సుందర్‌దాస్కు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఆయనను తర్వాత దివాలా వ్యక్తిగా ప్రకటించడంతో, ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఈ కారణంగానే సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

చాలా కాలం పాటు సాగిన చర్చలు, న్యాయపరమైన ప్రక్రియల అనంతరం, చివరకు స్టూడియో గ్రీన్ కోర్టు నుంచి సినిమా విడుదలకు అనుమతి పొందింది. అయితే ఇప్పుడు మరో కొత్త కేసు రావడంతో, జనవరి 14న సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేక మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మాతలు వేగంగా ఈ సమస్యను పరిష్కరిస్తే మాత్రం, సినిమా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి వాయిదా తప్పదని సమాచారం.

నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వా వాత్తియార్’ సినిమాలో కార్తీ ఓ నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. దివంగత సూపర్ స్టార్‌, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) ప్రతిపాదించిన విలువలు, సిద్ధాంతాలను కాపాడేందుకు ఏ హద్దులకైనా వెళ్లే పోలీస్ పాత్రలో కార్తీ నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… ఈ సినిమా లీగల్ సమస్యల నుంచి బయటపడి, పొంగల్‌ పండుగకు ప్రేక్షకులను అలరించగలుగుతుందా? అన్నదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *