ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. గుజరాత్‌లోని వారాహి గోశాలను తాజాగా సందర్శించిన ఆయన, అక్కడ గోవుల సంరక్షణకు గ్రామస్తులు చూపుతున్న నిబద్ధతను చూసి హృదయపూర్వకంగా ప్రశంసించారు. మూగజీవాల పట్ల ఆ గ్రామ ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో గోశాలలో ఉన్న వేలాది గోవుల సంరక్షణకు తనవంతు సహాయంగా రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ, “కొద్ది ఆవులతో ప్రారంభమైన ఈ గోశాల నేడు 7 వేలకుపైగా గోవులకు ఆశ్రయంగా మారడం నిజంగా గొప్ప విషయం. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ గోవుల కోసం పాటుపడటం అభినందనీయం. వారు చేస్తున్న సేవకు నా చిన్న సహాయమే ఇది. ఈ విధమైన గోశాల సంరక్షణ దేశమంతా విస్తరించాలి” అని అన్నారు. భవిష్యత్తులోనూ వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తానని హామీ ఇచ్చారు.
కరోనా కాలం నుంచే సమాజ సేవలో ముందుంటున్న సోనూసూద్, లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి చేయూతనిస్తూ ‘రియల్ హీరో’గా ప్రజల మనసుల్లో నిలిచారు. సినిమాల్లో విలన్ పాత్రలతో పాటు హీరో, దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నప్పటికీ, సేవలో మాత్రం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా సోనూసూద్ మరోసారి గుర్తింపు పొందారు.