విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సంక్రాంతి సంబరాలను ఎస్పీ దామోదర్ సోమవారం ప్రారంభించారు. ఖాకీ రంగు దుస్తులతో యూనీఫాంలో ఉండే స్టేషన్ సిబ్బంది యావత్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో దాదాపు 40 మందికి సంప్రదాయ దుస్తులైన పంచకట్టుతో స్టేషన్ లో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు.వేడుకలసందర్బంగా స్టేషన్ లో భోగీమంటలు వేసారు.
అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అన్నది ఒక మతానికి, కులానికి చెందినది కాదన్నారు. వ్యవయసాయదారులు కష్టించి పండించిన పంట చేతికి రావడం, సిరి సంపదలు, ఆదాయం చేతికి అందడంతో, కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ, జరుపుకొనే వేడుకని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి వేడుకను నగరంలోని టూటౌన్ పోలీసు స్టేషను ప్రాంగణంలో నిర్వహించుకోవడం, వేడుకల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అన్న తారతమ్యం లేకుండా నిర్వహించుకోవడం, పోలీసు కుటుంబాలు కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజలకు పోలీసులు ఎప్పుడూ చేరువగా ఉండాలని, పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులకు చట్ట పరిధిలో సహాయపడాలన్నారు. స్టేషన్ కు వచ్చే బడుగు, బలహీన వర్గాలు, పేదలు, వృద్ధులు, మహిళలు, పిల్లలకు అందుబాటులో ఉంటూ, పోలీసు సేవలను అందించాలన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపట్ల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించ వద్దని, వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
విధి నిర్వహణలో భాగంగా ఎల్లప్పుడు ఖాకీ యూనిఫారం ధరించే పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలసి తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి, వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు ఆకట్టుకున్నాయి. అనంతరం, జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ సందర్శించి, పోలీసు స్టేషన్ లో గతంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం, టూటౌన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, టూటౌన్ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్ఐలు కృష్ణమూర్తి,కనకరాజు,సిబ్బంది జనార్ధన్ రావు,విజయ్,అర్జున్,సన్యాసి నాయుడు,ధీరజ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.