పిఠాపురంలో ఘనంగా ‘పిఠాపురం సంక్రాంతి మహోత్సవం’ – సహకరించిన ప్రతి ఒక్కరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

Pithapuram Sankranti Mahotsavam Concludes Successfully, Pawan Kalyan Thanks Everyone

సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాష్ట్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, ఆ శాఖ అధికారులకు, స్టాల్స్ ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, జౌళి, చేనేత, చేతి వృత్తుల శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆహ్వానం మేరకు సంక్రాంతి మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సహచర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, శ్రీ
నారాయణ గారికి, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారికి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి, రెండో రోజు కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీ నాగ బాబు గారికి, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. మూడు రోజులపాటు మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అలరించిన కళాకారులకు ధన్యవాదాలు.

మొదటి రోజు సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన శ్రీ ఎస్. వరప్రసాద్ గారు, కర్నూలు జిల్లా నుంచి గురవయ్యలు కళారూపంతో సంప్రదాయ వైభవాన్ని చాటిన శ్రీ జె. మల్లికార్జున గారు, అదే జిల్లాకు చెందిన లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీమతి జి. సునీత గారు, కృష్ణా జిల్లా సంప్రదాయమైన డప్పులు కళారూపాన్ని ఘనంగా ప్రదర్శించిన శ్రీ వి. రాజీవ్ బాబు గారు ప్రేక్షకులను ఎంతో అలరించారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పెటగుళ్లు కళారూపంతో జానపద వైభవాన్ని ప్రతిబింబించిన శ్రీ కె. మల్లేశ్వర రావు గారు, విజయనగరం జిల్లా సంప్రదాయ పులి వేషాలతో సంబరాన్ని రెట్టింపు చేసిన శ్రీ కె.అప్పారావు గారు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ ప్రాంతానికి చెందిన థింసా నృత్యంతో ఆదివాసీ సంస్కృతిని ఆవిష్కరించిన శ్రీ పొద్దు అర్జున్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణా–గోదావరి ప్రాంతానికి చెందిన కోలాటం కళారూపంతో మహిళా శక్తిని చాటిన శ్రీమతి అంజలి గారు, కోనసీమ సంప్రదాయ గరగలు కళారూపంతో సంప్రదాయాన్ని నిలిపిన శ్రీ రాజ్‌కుమార్ గారు, హరిదాసులు–గంగిరెద్దు కళారూపంతో భక్తి రసాన్ని నింపిన శ్రీ సతీష్ గారు ప్రదర్శనలు తొలి రోజుని మరింత స్మరణీయంగా మార్చాయి.

రెండవ రోజు ప్రార్థనా గీతాలతో శుభారంభం చేసిన శ్రీ విజయ శంకర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల, రాజమహేంద్రవరం బృందానికి, కూచిపూడి రామాయణ ఘట్టాల ప్రదర్శనతో భక్తి భావాన్ని నింపిన వీ.ఎస్. ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల, రాజమహేంద్రవరం విద్యార్థులకు, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనను ఆవిష్కరించిన ప్రవీణ శ్రుతి లయ – పిఠాపురం వారి కూచిపూడి (ఆల్ ఇండియా డాన్స్ ఫార్మ్స్) ప్రదర్శనకు, యోగా డ్యాన్స్ ద్వారా ఆరోగ్యం–ఆధ్యాత్మిక సమన్వయాన్ని చాటిన శ్యామ్ బాబు గారి బృందానికి అభినందనలు.

మూడవ రోజు వినాయక తత్వాన్ని ప్రతిబింబించిన కూచిపూడి నృత్యప్రదర్శనతో అలరించిన మంజీర కూచిపూడి – దుర్గారావు గారి బృందానికి, శ్రీ నటరాజ నృత్య రూపంతో ఆంధ్ర నాట్య వైభవాన్ని చాటిన శ్రీ పి. సత్యనారాయణం గారికి, రేలారే రేలా జానపద గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన జానకీరావు ఆర్కెస్ట్రా బృందానికి అభినందనలు. ఈ మహోత్సవంలో పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన ప్రతి సంప్రదాయ కళాబృందంలోని కళాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

సంబరాల్లో భాగంగా మొదటి రోజు పిఠాపురం పట్టణంలో ప్రధాన వీధులు, , రెండో రోజు గొల్లప్రోలు మండలం, మూడో రోజు యూ.కొత్తపల్లి మండలాల్లో తిరుగుతూ ప్రజలందరినీ అలరించేందుకు మీరు చేసిన కృషి మరువలేనిది. ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన తోలు బొమ్మల కళాకారులు, మగ్గాలతో సహా వచ్చిన నేతన్నలు, ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులు, బొబ్బిలి వీణల తయారీదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టాల్ వద్దే వీణలు తయారు చేసిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అని పిలవగానే కదిలి వచ్చిన నటులు శ్రీ హైపర్ ఆది గారికి, శ్రీ ఆర్. కె. సాగర్ గారికి, హీరో శ్రీ నవీన్ పొలిశెట్టి గారికి, ప్రముఖ దర్శకులు శ్రీ హరీష్ శంకర్ గారికి, జబర్దస్త్ నటులు శ్రీ నెల్లూరు నాగరాజు గారికి, శ్రీ శ్రీనివాసులు నాయుడు గారికి, బుల్లితెర నటులు శ్రీ అభిరాం గారు తదితరులకు నా హృదయపూర్వక ధన్వవాదాలు. ఈ వేడుకకు పూర్తి స్థాయిలో సహకరించిన జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్ గారికి, జిల్లా యంత్రాంగానికి, భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ గారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు నుంచి కానిస్టేబుల్స్ , హోమ్ గార్డులు వరకూ అందరికీ కృతజ్ఞతలు. పిఠాపురంతోపాటు కాకినాడ జిల్లా పరిధిలోని జనసేన, కూటమి పార్టీల నాయకులు, శ్రేణులకు, కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన నా నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సంక్రాంతి ఇచ్చిన ఉత్సాహం పిఠాపురం ప్రజల్లో ఏడాది మొత్తం కొనసాగాలి. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి. అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. – పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *