మెగాస్టార్ నటించిన మన శివశంకరవరప్రసాద్గారు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రీమిమర్ షో నుంచే పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. మెగాస్టార్ సినిమా అభిమానులతో కిక్కిరిపోయిన నేపథ్యంలో కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ అభిమానిగా సినిమా చూసేందుకు వచ్చిన రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్, థియేటర్లోనూ హటాత్తుగా కుప్పకూలిపోయారు. అయితే, చుట్టుపక్కల ఉన్నవారు గమనించి వెంటనే ఆయన్ను హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
కానీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఆనంద్ కుమార్ మరణించాడు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లో అభిమాని మృతి చెందడంతో సినీ యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. అభిమాని కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి థియేటర్లో నవ్వుల పంటను, కలెక్షన్ల సునామీని తీసుకొచ్చింది. తొలిరోజే సుమారు వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నది.