సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో భాగ్యనగరం నుంచే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న గోదావరి జిల్లాకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లా రహదారులు రద్దీగా మారిపోయాయి. సొంతవాహనాలు, ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే, భీమవరంలో ప్రస్తుతం ఎన్నడూ లేనివిధంగా రద్దీ నెలకొన్నది. సొంత ఊళ్లకు వచ్చిన వారి వాహనాలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. భీమవరం చిన్న వంతెనపై అటు ఇటూ దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది.
ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయవలసి వచ్చింది. ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి సుమారు మూడు గంటలకు పైగా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో కంటే ఈసారి సంక్రాంతి పండుగ మరింత కలర్‌ఫుల్‌గా ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లిపోయారు.