సీనియర్ తెలుగు సినీ నిర్మాత అనిల్ సుంకర బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్ల గురించి నిజాన్ని బయట పెట్టేసరికి అందరు షాక్ అయ్యారు. సినీ పరిశ్రమలో ఈ పోస్టర్లు ఎక్కువగా రియల్ నెట్ లాభాలను చూపించడానికి కాకుండా, కేవలం ప్రచార వ్యూహంగా మాత్రమే ఉపయోగిస్తారని ఆయన స్పష్టంగా చెప్పారు.
మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం దూకుడును నిర్మించిన అనిల్ సుంకర, ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ అంటూ పోస్టర్లు విడుదల చేశామని గుర్తు చేశారు. అయితే గ్రాస్ కలెక్షన్లు అనేవి నిర్మాతలకు నిజంగా వచ్చే ఆదాయాన్ని ప్రతిబింబించవని ఆయన తెలిపారు.
దూకుడు సినిమా సుమారు రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ, నిర్మాతకు అందిన షేర్ మాత్రం దాదాపు రూ.40 కోట్లే అని అనిల్ సుంకర వివరించారు. గ్రాస్, షేర్ మధ్య తేడా చాలా మందికి తెలియకపోవడంతో, ఇలాంటి భారీ సంఖ్యలు సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
చాలా మంది నిర్మాతలు కలెక్షన్ పోస్టర్లను ఒక ప్రచార ఆయుధంగా ఉపయోగించారని, ప్రారంభ దశలో అది సినిమాలకు కొంతవరకు ఉపయోగపడిందని ఆయన అన్నారు. కానీ కాలక్రమంలో ఈ పద్ధతి కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతూ నష్టం కలిగించిందని కూడా తెలిపారు. అందుకే తాను వ్యక్తిగతంగా తన సినిమాల కోసం ఇకపై ఇలాంటి కలెక్షన్ పోస్టర్లు విడుదల చేయడం మానేశానని అనిల్ సుంకర వెల్లడించారు.